హైదరాబాద్: టీజీ20 (TG20) లీగ్ తొలి సీజన్ టైటిల్‌ను హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌పై హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఖమ్మం ఏసెస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు కేవలం 17.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అభిరథ్ రెడ్డి (30 బంతుల్లో 48 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్స్) ముందుండి జట్టును నడిపించగా, వైష్ణవ్ రెడ్డి (28 బంతుల్లో 41 పరుగులు, 1 ఫోర్, 3 సిక్స్‌లతో నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. వీరికి తోడు షణ్ముఖ అశ్విన్ (36 పరుగులు), ప్రణవ్ వర్మ (19 నాటౌట్) కీలక పరుగులు సాధించారు. ఖమ్మం బౌలర్లలో విద్యానందరెడ్డి, హర్షిత్ సాయి, వేద్‌రెడ్డి, షేక్ అజర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఖమ్మం ఏసెస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఖమ్మం ఇన్నింగ్స్‌లో మికిల్ జైస్వాల్ (39 బంతుల్లో 65 పరుగులు, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. హిమతేజ (31 పరుగులు), విద్యానంద రెడ్డి (20 నాటౌట్), ప్రతీక్ రెడ్డి (15 పరుగులు) కాస్త సహకారం అందించారు. కానీ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఖమ్మం బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా, దేవ్ మెహతా, అజయ్ గౌడ్ చెరో 2 వికెట్లు, అఖిల్ రాథోడ్ ఒక వికెట్ పడగొట్టి ఖమ్మం జట్టును భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.

టోర్నమెంట్ నిర్వహణ
ఈ సరికొత్త లీగ్‌ను తెలంగాణలోని స్థానిక క్రికెట్ ప్రతిభను, యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా శ్రీనిధి యూనివర్సిటీ సౌజన్యంతో నిర్వహించింది.

టీజీ 20 ప్రైజ్ మనీ
తొలి సీజన్ టైటిల్ విజేతగా నిలిచిన 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' జట్టు ఏకంగా రూ. 1 కోటి రూపాయల భారీ నగదు బహుమతిని గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన 'ఖమ్మం ఏసెస్' జట్టు రూ. 50 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది.

రివెంజ్ విక్టరీ
వాస్తవానికి టీజీ20 తొలి సీజన్ క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ఇదే ఖమ్మం ఏసెస్ జట్టు చేతిలో 10 పరుగుల తేడాతో హైదరాబాద్ తొలి ఓటమిని చవిచూసింది. అయితే క్వాలిఫైయర్-2 లో కరీంనగర్ డైమండ్స్‌ను ఓడించి హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు చేరింది. క్వాలిఫయర్ 1లో తమను ఓడించిన ఖమ్మంపైనే ఫైనల్‌లో గెలిచి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ హైదరాబాద్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.