<p>నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన యువతి, తనను ప్రేమించి సహజీవనం చేసిన వ్యక్తి మోసం చేస్తున్నాడంటూ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన సందీప్ అనే యువకుడితో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడిందని, అది సహజీవనానికి దారితీసిందని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు తనను కాదని, సందీప్ మరొక యువతితో వివాహానికి సిద్ధమయ్యాడని ఆమె ఆరోపిస్తోంది.</p>
<p>తన జీవితానికి రక్షణ కల్పించాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ యువతి ఆదివారం ఉదయం నుంచే నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎదురుచూసింది. తన గోడును పోలీసులకు విన్నవించుకున్నా, కనీసం ఫిర్యాదును కూడా నమోదు చేసుకోలేదని ఆమె విచారం వ్యక్తం చేసింది. పోలీసుల నుంచి సరైన స్పందన లభించకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు, తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందున్న రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. బాధితురాలి నిరసనతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయి గందరగోళం నెలకొంది.</p>
<p>ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ వద్ద భారీగా జనం గుమిగూడారు. మోసపోయిన యువతికి న్యాయం చేయాలని ఆమె బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తనను మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతను మరో పెళ్లి చేసుకోకుండా అడ్డుకోవాలని బాధితురాలు పోలీసులను కోరుతోంది. పోలీసులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని తెలుస్తోంది.</p>