హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు సాగుతోంది. అయితే రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047’ పేరుతో ఒక డాక్యుమెంట్‌ రూపొందిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్‌ రూపొందిస్తోంది. డాక్యుమెంట్ తయారీలో రాష్ట్ర పౌరులు భాగస్వాములు అయ్యేలా సిటిజన్‌ సర్వేకు శ్రీకారం చుట్టారు.

ఈ సర్వే అక్టోబర్ 25 వరకు కొనసాగుతుందని పౌరులందరూ ఇందులో పాల్గొని తమ విలువైన సలహాలు, సూచనలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 14న) సర్క్యులర్‌ జారీ చేసింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వేకు సంబంధించిన లింక్‌ను, క్యూఆర్‌ కోడ్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని సీఎస్‌ కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌరులంతా https://www.telangana.gov.in/telanganarising/ అనే వెబ్‌సైట్ ద్వారా సర్వేలో పాల్గొనాలని సీఎస్ సూచించారు.

తెలంగాణ రైజింగ్ విజన్ 2024 సర్వేలోని కీలకాంశాలు..
- తెలంగాణ 2047 నాటికి ఎలా ఉండాలని పౌరులు కోరుకుంటున్నారు. అందుకోసం ఏంచేయాలి, ఎలాంటి విధానాలు అవసరమో వారి ఆలోచనలు, సూచనలను సర్వేలో పొందుపరచాలి.
- 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వృద్ధిని 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడంలో భాగంగా ఉద్యోగాల కల్పించడానికి నిర్వహించాల్సిన కోర్సులు, ఔత్సాహిక స్టార్టప్‌లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు, ప్రభుత్వం చేపట్టాల్సిన సంస్కరణలు, చర్యలు
- స్థానిక సంస్థల బలోపేతానికి అవసరమైన నిధులు, అధికారాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు
- రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రణాళికలు
- రాష్ట్రంలో ప్రతి మండలానికో ఆసుపత్రి, సంచార వాహనాలు, టెలి మెడికల్ ట్రీట్మెంట్, పారిశుద్ధ్యం, తక్కువ ధరలకు మెడిసిన్, ఆరోగ్య బీమా, సంబంధిత అంశాలు
- ఏఐ, రోబోటిక్స్, ఐటీఐలో నైపుణ్య ఆధారిత కోర్సులు, అంతర్జాతీయస్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటు, స్కిల్ డెవలప్‌మెంటుపై ఫోకస్
- పౌర సేవలను ఒకే పోర్టల్‌ కిందకు తీసుకురావడంపై ప్రణాళిక
- ఫార్మా, బయో సైన్స్‌, అంతరిక్షం, రక్షణ రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు
- గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మారుమూల ప్రాంతాల్లో అధునాతన సేవల విస్తరణ