Telangana Panchayat Election Results | కొల్లాపూర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిల‌బెట్టుకున్నామ‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై చిన్నంబావిలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిర్వాకం వ‌ల్ల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్న‌భిన్న‌మైంద‌ని, ధనిక రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారింద‌ని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్ర‌జ‌ల సంతోష‌మే ల‌క్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల‌ను ఒక్కొక్కటిగా అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. మిగిలిన హామీల్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలోనే అమలు చేస్తుందన్నారు. చాలాచోట్ల ఇంకా పనులు మొదలుపెట్టాల్సి ఉందన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ, సమర్థతతో పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లో గట్టి నమ్మకం, విశ్వాసం ఏర్పడింద‌నడానికి ఈ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలే నిద‌ర్శ‌మ‌ని జూపల్లి పేర్కొన్నారు.

50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం

కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో జరిగిన మొద‌టి, రెండ‌వ విడ‌త గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిల‌బెట్టుకుంద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో 50 చోట్ల (3 స్వ‌తంత్రుల‌ను క‌లిపి) అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవగా, 28 స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. రెండు సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చుతున్నాయని, కొన్ని పనులు ఇంకా ప్రారంభదశలో ఉన్నాయని తెలిపారు.

త్వరలోనే చిన్నంబావి పనులు చేపడతాం..

చిన్నంబావికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశాం. పనులకు టెండర్లు ఆహ్వానించాం. ఆర్ అండ్ బీకి రూ.200 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.100 కోట్లతో పనులు చేపడుతున్నాం. వాటి నుంచి చిన్నంబావి మండలం అభివృద్ధి పనులకు కేటాయించాం. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు మేం మద్దతు తెలిపిన అభ్యర్థులు మూడింట రెండు వంతులు గెలుపొందుతూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.