Telangana Political War: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అంశం మున్సిపల్ ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చేతిలో అధికారం ఉండి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బాల్ రేవంత్ రెడ్డి కోర్టులోకి నెట్టారు.

కిషన్ రెడ్డి డిమాండ్లు, ప్రశ్నలు: మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి చేతగాక, తన బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై, తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఏ రోజైనా రాహుల్ గాంధీ ఆదేశించారా అని ఆయన నిలదీశారు. సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడ్డుకోవడానికి లోపాయికారీగా ఏకమయ్యాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కిషన్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి 'ఫెవికాల్ బంధం' వ్యాఖ్యలు

ఇటీవల నిజామాబాద్ జిల్లా బర్దిపూర్‌లో నిర్వహించిన 'ప్రజా పాలన-ప్రగతి బాట' బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అని ఆయన అభివర్ణించారు. కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్టు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డిని ఉద్దేశించి కల్వకుంట్ల కిషన్ రావు అంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ, ఆ కేసులో సీబీఐ విచారణను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల ముంగిట మాటల తూటాలు

రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు వేయడం అంటే ఆ ఓటును మూసీ నదిలో వేసినట్లేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు చేసినట్లు తేలితే కనుక కేసీఆర్, కేటీఆర్‌ల అరెస్ట్ తప్పదన్నారు. అయితే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా.. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, ఆ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేంద్రం విచారణ చేపట్టి కేసీఆర్ అవినీతిని బయటపెట్టి అరెస్ట్ చేస్తుందనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించినట్లు రేవంత్ పేర్కొన్నారు.

అటు కిషన్ రెడ్డి సైతం స్పందిస్తూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికే రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తానికి, కేసీఆర్ అరెస్టు అంశం కేంద్ర బిందువుగా మారి తెలంగాణ రాజకీయాల్లో ముక్కోణపు పోటీని రక్తికట్టిస్తోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ వ్యక్తిగత విమర్శలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.