Telangana Latest News: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 9 (G.O. Ms. No. 9) అమలుపై హైకోర్టు మధ్యంతర స్టే విధించడం తెలిసిందే. దీంతో, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. జీవో నెంబర్ 9పై హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు మూడు ప్రధాన ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఈ కథనం పూర్తిగా చదివితే అర్థమవుతుంది.

కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఎం.ఎస్. నెంబర్ 9ని జారీ చేసింది. అయితే, ఈ జీవో అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో, ఇప్పుడు ఆ పార్టీ ముందున్న చట్టపరమైన, రాజకీయపరమైన 'బిగ్ త్రీ' ఆప్షన్స్‌ ఇవే:

ఆప్షన్ 1: సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే ఎత్తివేయించడం

హైకోర్టు జీవో నెంబర్ 9పై విధించిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ప్రభుత్వానికి ఉన్న తొలి ఆప్షన్. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి, విచారణకు వచ్చేలా చూడటం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియను రిజర్వేషన్లు పెంపు సందర్భంగా పాటించినట్లు చట్టపరంగా నిరూపించాల్సి ఉంటుంది. ఇందుకుగాను, బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణన సర్వే, బీసీ కమిషన్ ఏర్పాటు, ఆ కమిషన్ చేసిన అధ్యయనం, సిఫారసులను సుప్రీంకోర్టు ముందు ఉంచడం ద్వారా, తమకు అనుకూలంగా అంటే జీవో నెంబర్ 9పై స్టేను ఎత్తివేసేలా చేయడం మొదటి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

ఆప్షన్ 2: పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడం

హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలనుకుంటే, పాత రిజర్వేషన్లనే అమలు చేస్తూ ఎన్నికల ప్రక్రియలో ముందుకు సాగడం రెండో ఆప్షన్. లేదా ప్రభుత్వం దీనిపై సుప్రీంలో పిటిషన్ వేయకపోయినా, ఒకవేళ పిటిషన్ వేసినప్పటికీ జీవో నెంబర్ 9పై స్టే ఎత్తివేయకపోతే ఉన్న మరో ఆప్షన్... 42 శాతం రిజర్వేషన్లు బదులు, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించడం. అప్పుడు ఈ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంటే 50 శాతం లోపు ఉండటం వల్ల లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీనివల్ల హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండటమే కాకుండా, కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు నిధులు అందే అవకాశం ఉంది. అయితే, ఈ ఆప్షన్ ప్రకరం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే, ప్రతిపక్షాలు, బీసీ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఆప్షన్ 3: గవర్నర్ ఆమోదం, చట్ట సవరణపై దృష్టి పెట్టడం

గవర్నర్ ఆమోదం లేకుండానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీవో నెంబర్ 9ను జారీ చేయడంపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ జీవోకు చట్టబద్ధ సవరణ చేయడం మరో ఆప్షన్ గా చెప్పవచ్చు. అంటే, బీసీ రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ ద్వారా ఆమోదింపజేయడం, హైకోర్టు లేవనెత్తిన సాంకేతిక అంశాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం ఈ ఆప్షన్‌లో భాగంగా చెప్పవచ్చు. జీవో ద్వారా కాకుండా శాసనసభ చేసిన చట్టం ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తే చట్టపరమైన రక్షణ ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొంత సమయం పట్టినా, ఈ ప్రక్రియ ద్వారా అనుకున్న రీతిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నించడం సరైన ప్రక్రియ. అయితే, చట్టసభలో ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం అన్నది తెలంగాణ సర్కార్ చేతుల్లో లేని పని. ఈ ఆప్షన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనడం మాత్రం సందేహాస్పదమే.

అయితే, ఈ మూడు ఆప్షన్స్ కూడా సుళువుగా ఎంచుకుని అమలు చేసే పరిస్థితి అయితే లేదు. కాకపోతే, సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అన్నది కాంగ్రెస్ సర్కార్‌కు కేవలం చట్టపరమైన సవాల్ మాత్రమే కాదు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయడం, బీసీల పట్ల తమ చిత్తశుద్ధి ప్రదర్శనకు కీలకం. బీసీ వర్గాల మద్దతు నిలుపుకోవడం ప్రధానం. అయితే, ప్రభుత్వం ఏ ఆప్షన్ ఎన్నుకుంటుంది, 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తుందన్నది మాత్రం తెలియాలంటే వేచి చూడాల్సిందే.