Telangana High Court: తెలంగాణలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం రాజకీయ రణరంగాన్ని సృష్టించాయి. బీసీ రిజర్వేషన్ కోసం తీసుకొచ్చిన జీవోపై స్టే విధించడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు బీసీ సంఘాలు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. బీసీలు అధైర్య పడొద్దని కుట్రలను ఛేదించుకొని బీసీలకు రిజర్వేషన్లు సాధించి తీరుతామని మంత్రులు భరోసా ఇస్తున్నారు.

తెలంగాణలో బీసీల ఇచ్చే రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. రాజకీయంగా మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని ప్రభుత్వం కోర్టులో వాదించినప్పటికీ స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే రిజర్వేషన్‌లతో తాజాగా ఇచ్చిన లోకల్ బాడీ ఎన్నికలపై కూడా దీని ప్రభావం పడుతుంది. కోర్టు తన నిర్ణయాన్ని చెప్పిన వెంటనే బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచి విమర్శలు గుప్పించాయి. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం హడావిడిగా ఈ ప్రక్రియ చేపట్టిందని అందుకే ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆరోపించాయి. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గినా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చూడాల్సి ఉంటుందని బీసీ సంఘాలు హెచ్చరించాయి.

కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే : బీజేపీ

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఓబీసీలు ఎదుర్కొంటున్న దురవస్థకు కారణమని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, న్యాయపరమైన లొసుగులు సరిచేసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు.

గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి తప్పు చేసిందన్నారు. ఇది చట్టవిరుద్ధమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా చట్టపరమైన లొసుగులను సరిదిద్దుకని సుప్రీంకోర్టును ఆశ్రయించి బీసీలకు న్యాయం చేయాలన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు "బిజెపి అడ్డుకుంటోంది" అనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసినవారే కాంగ్రెస్ పార్టీకి చెందినవారని రాంచందర్ రావు ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్త ఉద్యమం: ఆర్‌ కృష్ణయ్య

మరో బీజేపీ నేత ఆర్‌ కృష్ణయ్య హైకోర్టులో ఆందోళన చేపట్టారు. బీసీల నోటికి దగ్గరగా వచ్చే అన్నం ముద్దను లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తొందరపాటు చర్యల కారణంగానే ఇది జరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం స్పందన చూసిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అనుకూలంగా చర్యలు లేకుంటే మాత్రం కచ్చితంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని తీసుకొస్తామని హెచ్చరించారు.

ఆరు గ్యారెంటీ మాదిరి డ్రామా: హరీష్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో మరో డ్రామాకు తెర తీసిందన్నారు బీఆర్ఎ‌స్ నేత హరీష్‌రావు ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతున్నారని అన్నారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ నాయకులతో డిల్లీ వేదికగా కోట్లాట పెట్టండి. కలిసి రావడానికి బిఆర్‌ఎస్ ఎల్లప్పుడూ సిద్ధమని ప్రకటించారు.

"మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్‌ రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిందిపోయి తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీసారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడండి. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చండి. బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయండి. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించండి. ఉద్యమ పార్టీగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది. ఢిల్లీని నిలదీస్తుంది." అని తెలిపారు.