రాజేంద్రనగర్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II నివాస భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వి. భట్టి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో ఒక అరుదైన, గౌరవప్రదమైన రోజు అని పేర్కొన్నారు.

న్యాయ దేవాలయం.. అన్నింటికంటే ఒక పవిత్ర కార్యం
భారత్‌లో దేవాలయం, మసీదు, చర్చి లేదా గురుద్వారా నిర్మించడం ఎంత గొప్ప విషయమో, ఒక కోర్టు సముదాయాన్ని నిర్మించడం అంతకంటే గొప్ప విషయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. న్యాయం కోసం ప్రాంగణాన్ని సృష్టించడం అంటే అన్ని మతాల ప్రజల కోసం ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లేనని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావుల సమక్షంలో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం తన జీవితంలో లభించిన అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రజాస్వామ్యానికి ప్రతిబింబం కోర్టులు
సాధారణ పౌరుడికి న్యాయస్థానమే చివరి ఆశ అని, ఆ నమ్మకాన్ని నిలబెట్టడం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నూతన హైకోర్టు కేవలం ఒక భవనం కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం. శాసన, కార్యనిర్వాహక, మరియు న్యాయ వ్యవస్థలు పరస్పర గౌరవంతో, సహకారంతో పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే 100 సంవత్సరాల పాటు పేదలు, బలహీనులు, అణగారిన వర్గాల వారు తమ సమస్యలు వినిపించుకునే వేదికగా ఈ న్యాయ మందిరం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అత్యున్నత మౌలిక సదుపాయాలు - లక్ష్యం 2027
2023 డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తీసుకున్న మొదటి నిర్ణయాల్లో కొత్త హైకోర్టు నిర్మాణం ఒకటని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇందుకోసం రాజేంద్రనగర్‌లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామని, జోన్-1 పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నేడు ( ఏప్రిల్ 5న) జోన్-2 నివాస భవనాలకు శంకుస్థాపన జరిగిందని, ఈ ప్రాజెక్టు మొత్తాన్ని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. కేవలం హైకోర్టు మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 49 కోర్టులు, నివాస సముదాయాల కోసం కొత్త ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.