IT Act Intermediary Rules:  లైంగిక నేరాలకు గురైన బాధితుల వ్యక్తిగత ప్రైవసీ, ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేస్తూ, ఆమె డిజిటల్ ప్రైవసీకి విఘాతం కలిగిస్తున్న 200 కంటే ఎక్కువ వీడియోలు, ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులను తక్షణమే డిలీట్ చేయాలని ప్రముఖ డిజిటల్ దిగ్గజాలైన యూట్యూబ్, గూగుల్, మెటా , ఎక్స్ వేదికలను ధర్మాసనం ఆదేశించింది. బాధితురాలి రాజ్యాంగ హక్కులను పునరుద్ధరిస్తూ జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి ఈ మేరకు సంచలన ఉత్తర్వులు వెలువరించారు.

బాధితురాలి తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగుర్‌బాబు ఎన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. డిజిటల్ మీడియా యాజమాన్యాల బాధ్యతారాహిత్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల గ్రీవెన్స్ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా బాధితురాలి గుర్తింపును వెల్లడించే కంటెంట్‌ను తొలగించడంలో విఫలమయ్యారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు డిజిటల్ మాధ్యమాల్లో నిరంతరం ప్రసారం కావడం వల్ల ఆమె ఆత్మగౌరవానికి, సమాజంలో పునరావాసానికి తీవ్ర భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విచారణ సందర్భంగా అడ్వకేట్ నాగుర్‌బాబు ఎన్ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం పౌరులకు సంక్రమించిన జీవించే హక్కు, ప్రైవసీ హక్కులకు ఇది స్పష్టమైన భంగమని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000, ఐటీ ఇంటర్మీడియరీ రూల్స్-2021తో పాటు లైంగిక దాడి బాధితుల గుర్తింపును ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టకూడదంటూ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఉదహరించారు. నిరంతరం రీ-సైకిల్ అవుతున్న ఈ కంటెంట్ వల్ల బాధితురాలు కోలుకోలేని మానసిక వేదనను అనుభవిస్తున్నారని కోర్టుకు విన్నవించారు.

పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసింది. అత్యవసర మధ్యంతర ఉపశమనం కింద, రిట్ పిటిషన్ అనుబంధం-A లో పేర్కొన్న 200కి పైగా వివాదాస్పద యూట్యూబ్ వీడియోలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ పోస్టులను గ్లోబల్ లేదా ప్రాంతీయ స్థాయిలో తక్షణమే తొలగించాలని లేదా బ్లాక్ చేయాలని ఆదేశించింది. తదుపరి సమగ్ర విచారణను ఆగస్టు 20, 2026కు వాయిదా వేసింది.

డిజిటల్ విప్లవం వేగవంతమైన ఈ కాలంలో, సోషల్ మీడియా ఇంటర్మీడియరీలు చట్టపరమైన బాధ్యతలను విస్మరిస్తే ఊరుకునేది లేదని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బాధితుల హక్కులకు రక్షణగా నిలిచే చట్టబద్ధమైన నిబంధనలను డిజిటల్ దిగ్గజాలు కచ్చితంగా పాటించాల్సిందేనని, లైంగిక నేరాల బాధితుల ప్రైవసీకి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ ఉత్తర్వు మరోసారి చాటిచెప్పింది.