<p>హైదరాబాద్: జీవో 59 (GO 59) ద్వారా స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 500 చదరపు గజాల లోపు ఉన్న పెండింగ్ దరఖాస్తులన్నింటినీ రాబోయే నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో నంబర్ 48030 ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ జీవో అమల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చినదే జీవో 59.</p>
<p>గతంలో జీవో 59 అమలు విషయంలో జరిగిన పొరపాట్లు, అక్రమాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. అన్ని నిర్ణయాలు పూర్తిగా నిబంధనలకు లోబడి మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. అలాగే కన్వేయన్స్ డీడ్స్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.</p>