BRS KTR Allegations Kaleshwaram Water Release: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావం, నీటి ఎద్దడి, ఉష్ణోగ్రతల పెంపు ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ యుద్దానికి దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పంటలకు సాగునీరు అందక, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిన తరుణంలో.. ఈ పరిస్థితులకు కారణం ప్రకృతి వైపరీత్యం కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ చేతగానితనమే కారణమని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తోంది. క్షేత్రస్థాయిలో నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయకుండా పంటలను ఎండబెడుతున్నారని కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో కమలదళం, బీఆర్‌ఎస్‌లు విమర్శలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి.

కాళేశ్వరాన్ని ఉపయోగించలేదని బీఆర్ఎస్ విమర్శలు

బీఆర్‌ఎస్ ప్రధాన విమర్శనాత్మక అస్త్రం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతోంది. వేల కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సిద్ధంగా ఉన్నప్పటికీ, కేవలం గత ప్రభుత్వంపై బురద జల్లాలనే రాజకీయ దురుద్దేశంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా నీటిని తోడటం లేదు అని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. పైగా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎల్‌నినో ఉన్నప్పటికీ వారు నీటి యాజమాన్యాన్ని సక్రమంగా నిర్వహించి రైతులకు నీరందిస్తున్నారని, కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రకృతి వైపరీత్యం పేరుతో బాధ్యతల నుంచి తప్పుకుంటోందని ప్రజల్లో ప్రచారం చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, పునాదులు దెబ్బతినడం వల్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన హెచ్చరికలను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరపైకి తెస్తున్నారు. ప్రాజెక్టు భద్రతా నిబంధనలను ఉల్లంఘించి భారీగా నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేస్తే బ్యారేజీలు పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. గోదావరిలో ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో ప్రవాహాలు లేనప్పుడు పంపింగ్ చేయడం సాధ్యం కాదని, ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టుల మోడల్స్ , రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాలు వేరని సకారణంగా వివరిస్తున్నారు.

ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారు?

ఇరువర్గాల మధ్య నడుస్తున్న ఈ రాజకీయ హోరాహోరీలో ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారు? ఎవరిది పైచేయి కానుంది? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న తక్షణ ఇబ్బందులు, ఎండిపోతున్న పైర్లు, విద్యుత్ కోతలు వంటి సమస్యలు సహజంగానే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడిని, కొంత అసంతృప్తిని పెంచుతాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ రైతుల్లో ఉన్న ఈ ఆవేదనను, సెంటిమెంట్‌ను కాళేశ్వరం బంద్ ఇమేజ్‌కు ముడిపెడుతూ తమ మైండ్ గేమ్‌ను సమర్థవంతంగా రన్ చేస్తోంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం కూడా తక్కువేమీ కాదు. కాళేశ్వరం డిజైన్ లోపాలు, కేసీఆర్ హయాంలో జరిగిన నిర్మాణ నాణ్యతా లోపాలే నేటి మేడిగడ్డ పరిస్థితికి అసలు కారణమని ప్రజల మెదళ్లలో నాటేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఐదేళ్లకే కుప్పకూలడానికి కేసీఆరే బాధ్యుడు అనే నరేటివ్‌ను ప్రజల ముందుకు తెస్తోంది. పంటల నష్టపరిహారం చెల్లించడం, ప్రత్యామ్నాయ సాగు పద్ధతులకు ప్రోత్సాహకాలు ప్రకటించడం , తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం ద్వారా ప్రజామోదాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.

నష్టపోయేవారికి ప్రభుత్వంపైనే కోపం

గ్రామీణ ప్రాంతాల్లో పంటలు నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు సాంకేతిక కారణాల కంటే పొలాలకు నీళ్లు అందడమే ముఖ్యం. రేవంత్ ప్రభుత్వం గనక ఆటంకాలను తట్టుకుని రైతులకు ప్రత్యామ్నాయ నీటి వనరులను చూపించగలిగితే లేదా నష్టపరిహారంతో సమర్థవంతంగా ఆదుకోగలిగితే కాంగ్రెస్‌ పైచేయి సాధిస్తుంది. అలా కాకుండా, ఎల్‌నినో కష్టాలు దీర్ఘకాలం కొనసాగి, ప్రభుత్వ ఉపశమన చర్యలు జాప్యమైతే మాత్రం.. మా హయాంలో నీళ్లు ఇచ్చాం, వీళ్లు నీళ్లు తోడటం లేదు అన్న బీఆర్‌ఎస్ ప్రచారానికే ప్రజల ఓటు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.