Telangana lifts two child rule For local body elections: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల (లోకల్ బాడీ) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే 'ఇద్దరు పిల్లల నిబంధన' (two-child norm)ను ఎత్తివేయాలని నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను తొలగించాలని ఆమోదం తెలిపింది. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను ఎత్తివేయడంతో, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసే అవకాశం కలుగుతుంది.

ఈ నిబంధన 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడానికి అమల్లోకి తెచ్చింది. 1994 తర్వాత మూడో సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా మారారు. ఈ నిబంధన పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)లో భాగంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తివేయడం ద్వారా అభ్యర్థులకు వెసుబాటు కల్పించింది. కేబినెట్ నిర్ణయం మేరకు ముందుగా ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదానికి పంపనున్నారు. గవర్నర్ ఆమోదిస్తే, వచ్చే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేయవచ్చు.