హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో సోమవారం ఉదయం గందరగోళం నెలకొంది. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. వెల్ లోకి దూసుకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారిని వారించే ప్రయత్నం చేయడంతో మార్షల్స్ కు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

శాసనసభ నుంచి 24 మంది భారాస ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో 24 మంది భారాస (BRS) ఎమ్మెల్యేలపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్‌పై చర్చను అడ్డుకుంటున్నారని భావిస్తూ, సోమవారం సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు సభ ప్రారంభమైన వెంటనే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ భారాస సభ్యులు సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ పోడియం వద్ద బైఠాయించారు.

సభలో బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలోనూ సభ్యులు బల్లలు చరుస్తూ, నినాదాలు చేస్తూ నిరసనను కొనసాగించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సభాపతి అనుమతితో ఏ అంశంపైనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. నిరసన విరమిస్తే చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. అయితే, సభాసంఘం ఏర్పాటుతో పాటు ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై మాట్లాడే అవకాశం ఇస్తేనే తాము తమ స్థానాల్లోకి వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

నిరసనలు తగ్గకపోవడంతో, ప్రభుత్వ పక్షం తరఫున మంత్రి శ్రీధర్ బాబు సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి స్పీకర్ ఆమోదం తెలుపుతూ హరీశ్‌రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సహా మొత్తం 24 మంది సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. మల్లారెడ్డి, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి ఆ రోజు సభకు హాజరుకాకపోవడంతో వారిపై చర్యలు ఉండవు. సస్పెన్షన్ అనంతరం స్పీకర్ సభను వాయిదా వేయగా, భారాస సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు.