మొయినాబాద్: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ టెస్టులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ (ఏలూరు)తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.. ఈగల్ (EAGLE) ఫోర్స్ నిర్వహించిన మెరుపు దాడుల్లో నిందితులు తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీపై దాడులకు సంబంధించి ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఆర్. గిరిధర్ మీడియాకు వివరాలను వెల్లడించారు.

11 మందికి అదుపులోకి తీసుకున్న పోలీసులు..

"డ్రగ్స్ పార్టీ జరగుతుందని సమాచారం మేరకు మేం రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై దాడి చేశాము. లోపలికి ప్రవేశించిన సమయంలో మా అధికారులకు కొన్ని శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకోగా, ఒక వ్యక్తి పిస్టల్ పట్టుకుని కనిపించాడు. మరొకరి వద్ద ఖాళీ తూటాలు ఉన్నాయి. వెంటనే అక్కడ ఉన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారికి నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. అనంతరం ఆసుపత్రిలో నిర్వహించిన రక్త నమూనాల పరీక్షల్లో మరో వ్యక్తికి కూడా పాజిటివ్ రావడంతో, మొత్తం ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది" అని ఈగల్ ఫోర్స్ ఎస్సీ గిరిధర్ తెలిపారు.

ముఖ్య నేతలు అరెస్ట్
పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తొలుత పుట్టా మహేష్ యాదవ్‌కు నెగిటివ్ వచ్చినట్లు ప్రచారం జరిగినప్పటికీ, రక్త నమూనాల (Blood Sample) నివేదికలో ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందని ఎస్పీ స్పష్టం చేశారు.

కేసులో ముఖ్యాంశాలు..

మొత్తం అరెస్టులు: 11 మంది కస్టడీలో ఉండగా, ఆరుగురికి డ్రగ్ పాజిటివ్.

కాల్పుల కలకలం: పోలీసులను అడ్డుకునేందుకు ఒక వ్యక్తి పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు.

రికవరీ: ఫామ్‌హౌస్ నుండి పిస్టల్, ఖాళీ తూటాలు, డ్రగ్స్ స్వాధీనం.

నిందితులను వైద్య పరీక్షల అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.ఈ దాడిలో పట్టుబడిన వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక రాజకీయ నేతలు కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.