AP Local Body Elections | అమరావతి: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చింది. గత కొన్ని రోజులుగా పలు దఫాలుగా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు లెక్కలు తేల్చాయి. జనసేన అధిక సీట్లు డిమాండ్ చేసిందని చర్చల్లో మొదట్లో ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ.. రెండు పార్టీలు సానుకూల ధోరణితో చర్చలు కొలిక్కి తెచ్చాయి. ఓవైపు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తల ఆకాంక్షల్ని గౌరవిస్తూ కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠకు తెరదించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనే వివరాలు గురువారం రాత్రి ప్రకటించాయి.

రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాల్లో టీడీపీ (89) బరిలోకి దిగనుండగా, జనసేన 25, బీజేపీ 9 చోట్ల పోటీ చేయనున్నాయి. 17 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ స్థానాల్లో టీడీపీ 11 చోట్ల బరిలోకి దిగనుండగా, జనసేనకు 4, బీజేపీకి 2 స్థానాలు కేటాయించారు. రాష్ట్రంలోని మొత్తం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు 106 స్థానాల్లో ఛైర్‌పర్సన్‌ పదవులు టీడీపీకి 78 దక్కగా, జనసేనకు 21, బీజేపీకి 7 స్థానాలు కేటాయించారు. ఓవరాల్‌గా చెప్పాలంటే మొత్తం స్థానాల్లో జనసేన పార్టీకి 20.33 శాతం స్థానాలు, బీజేపీకి 7.32 శాతం స్థానాలు లభించాయి. ఒకవేళ మేయర్‌ లేక ఛైర్మన్‌గా ఒక పార్టీ ఉంటే, డిప్యూటీ మేయర్‌ లేక వైస్‌ ఛైర్మన్‌‌గా కూటమిలోని మరో పార్టీకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 100 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పాలక పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, మిగతా 23 చోట్ల కోర్టు కేసులు, ఓటర్ల జాబితా ఇతర కారణాల వల్ల వాయిదా పడ్డాయి.

మున్సిపల్ కార్పొరేషన్లు — 17

టీడీపీ: 11
జనసేన: 4
బీజేపీ: 2

మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు — 106

టీడీపీ: 78
జనసేన: 21
బీజేపీ: 7

పట్టణ స్థానిక సంస్థల మొత్తం స్థానాలు

పార్టీ మొత్తం స్థానాలు
టీడీపీ 89
జనసేన 25
బీజేపీ 9
మొత్తం స్థానాలు 123

జనసేనకు 4 కార్పొరేషన్లు కేటాయింపు

శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఏలూరు కార్పొరేషన్లు

బీజేపీకి 2 కార్పొరేషన్లు

రాజమండ్రి, అనంతపురం

టీడీపీకి 11 కార్పొరేషన్లు కేటాయింపు

విజయనగరం, గ్రేటర్ విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి- తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి