TDP First List: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు మొదలైంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ శుక్రవారం రాత్రి 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 7 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులు, 26 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలకు ఛైర్‌పర్సన్‌ అభ్యర్థుల్ని టీడీపీ అధిష్ఠానం ప్రకటించింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీలు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు టీడీపీ తెలిపింది.

బీసీలు సముచిత స్థానం

కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటుతో టీడీపీకి మొత్తం 11 కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలు దక్కాయి. తొలి విడతలో పది చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 78 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో టీడీపీ పోటీ చేస్తుండగా ప్రస్తుతం 66 చోట్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన గుంటూరు, ఒంగోలు, మచిలీపట్నం మేయర్‌ అభ్యర్థుల్ని శనివారం ప్రకటించనున్నారు. తొలి జాబితాలోని 36 మంది అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 22 మంది ఉన్నారు. కేవలం బీసీలకే 16 స్థానాలను కేటాయించడంతో తొలి జాబితాలోనే 44% స్థానాలు కేటాయించినట్లయింది. విశాఖపట్నం, విజయనగరం జనరల్ మహిళా స్థానాల్లోనూ బీసీలకే అవకాశమిచ్చి పార్టీ వారిపై భరోసా ఉంచిందని తెలుస్తోంది. ఏడు కార్పొరేషన్లలో నాలుగు స్థానాలు బీసీలకు, ఒకటి ఎస్సీలకు కేటాయించగా, ఆళ్లగడ్డ, రాయచోటిలో ఇద్దరు మైనార్టీలకు, మొత్తం జాబితాలో ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ అభ్యర్థికి చోటు దక్కింది.

మహిళలకు 53% రిజర్వేషన్లకు మించి

మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రకటించిన 36 స్థానాల్లో 19 మంది మహిళలకు (53%) అవకాశం కల్పించారు. వీరిలో మేయర్ అభ్యర్థులు ఐదుగురు ఉన్నారు. మహిళలకు రిజర్వ్ చేసిన 17 స్థానాలకు మించి అదనంగా మరో ఇద్దరికి స్థానం కల్పించారు. ముఖ్యంగా రిజర్వ్‌ లేకపోయినా చిత్తూరు కార్పొరేషన్, బద్వేలు మున్సిపాలిటీ స్థానాలను కూడా మహిళలకే కేటాయించడం విశేషం.

యువతకు ప్రాధాన్యం

ఎంపిక చేసిన 36 మంది అభ్యర్థుల సగటు వయసు 45.7 సంవత్సరాలు కాగా, 45 ఏళ్ల లోపువారు 16 మంది, 40 ఏళ్ల లోపువారు 10 మంది ఉన్నారు. రాజంపేట అభ్యర్థి డాక్టర్‌ దొంతం గాయత్రి (26) అత్యంత చిన్న వయస్కురాలిగా నిలవగా, విజయనగరం అభ్యర్థి భార్గవి (31), విశాఖపట్నం అభ్యర్థి శ్రావణి (32) కూడా యువ అభ్యర్థులే. పార్టీ విధేయులకు ఈ జాబితాలో అధిక ప్రాధాన్యత స్థానం లభించింది. తిరుపతి మేయర్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ ప్రసాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉండగా, విశాఖ అభ్యర్థి ముక్కా శ్రావణి, కర్నూలు అభ్యర్థి విజయ ప్రత్యూష తాజా మాజీ కార్పొరేటర్లు.

Also Read: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్

మేయర్ అభ్యర్థులు

విజయనగరం - అవనపు భార్గవి

విశాఖపట్నం - ముక్కా శ్రావణి

తిరుపతి - మన్నె శ్రీనివాస్ ప్రసాద్

చిత్తూరు - కటారి హేమలత

కడప - డా.నెల్లటూరి సువర్ణ

కర్నూలు - విజయ ప్రత్యూష

నెల్లూరు - పోలబోయిన రూప్ కుమార్

Also Read:  ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..