Bridge North-South Divide Through Literature: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ ఆడిటోరియం శనివారం జనవరి 24, 2026 భారతీయ సాహిత్యం, సంస్కృతి , భాషా సమగ్రతకు అద్దం పట్టింది. తథాగత్ సాహిత్య సమ్మాన్ వేడుకలో భాగంగా సాహిత్యం ద్వారా ఉత్తర,దక్షిణ భారతాల మధ్య దూరాన్ని తగ్గించే విజయవంతమైన ప్రయత్నం జరిగింది. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కేరళకు చెందిన సీనియర్ హిందీ సాహితీవేత్త ప్రొఫెసర్ ఏ. అరవిందాక్షన్ , అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రతిభావంతురాలైన యువ కవయిత్రి జమునా బీని లకు ప్రదానం చేశారు.

కళాత్మక ప్రారంభం , ట్రస్ట్ దార్శనికత

మహాకవి సూర్యకాంతి త్రిపాఠి నిరాలా రచించిన 'వర దే వీణా వాదిని' కూర్పుపై సాగిన మనసును హత్తుకునే కథక్ ప్రదర్శనతో వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తథాగత్ ట్రస్ట్ సంరక్షకుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్.పి. సింగ్ ట్రస్ట్ లక్ష్యాన్ని వివరించారు. "తథాగత్ ట్రస్ట్ ఉద్దేశ్యం కేవలం అవార్డులు ఇవ్వడం మాత్రమే కాదు.. ఉత్తర , దక్షిణ భారతదేశాల మధ్య భాషా, సాంస్కృతిక సంబంధాలను నిరంతరం కొనసాగించడం" అని ఆయన పేర్కొన్నారు. మానవీయ భావోద్వేగాల కోసం జీవితాంతం కృషి చేసిన ప్రముఖ సాహితీవేత్త రామ్ దరష్ మిశ్రా స్మృత్యర్థం ఈ అవార్డును అంకితం చేసినట్లు ఆయన తెలిపారు.

సాహిత్య సహకారంపై చర్చ

ఈ కార్యక్రమంలో హిందీ సాహిత్య రంగానికి చెందిన ప్రముఖులు అనామిక, అశోక్ వాజ్‌పేయి, ఓం నిశ్చల్, చంద్రకాంత తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతల రచనలపై ప్రసంగించారు. ప్రొఫెసర్ ఏ. అరవిందాక్షన్ రాసిన 'ధడ్కనో కే భీతర్ జాకర్' (గుండె చప్పుళ్ల లోతుల్లోకి వెళ్లి) అనే రచనపై చర్చించారు. అరవిందాక్షన్ హిందీని కేవలం దక్షిణ భారత కోణంలో స్వీకరించడమే కాకుండా, దానికి కొత్త భావోద్వేగ లోతును అందించారని వక్తలు ప్రశంసించారు.

అరుణాచల్ మట్టి వాసనను తన రచనల్లో ప్రతిబింబించే జమునా బీని కవితా సంకలనం 'జబ్ ఆదివాసీ గాతా హై' (ఆదివాసీ పాడినప్పుడు) ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. ఆమె కవితలు గిరిజన చైతన్యానికి, జల-జంగల్-జమీన్ కోసం సాగుతున్న పోరాటానికి మరియు అట్టడుగు సమాజానికి శక్తివంతమైన గొంతుకగా నిలుస్తాయని పండితులు అభిప్రాయపడ్డారు.

సున్నితత్వం, మానవత్వానికి వారధి

ముగింపు సెషన్‌లో వక్తలు మాట్లాడుతూ.. నేటి కాలంలో సమాజం విడిపోతున్న తరుణంలో, ఇలాంటి కార్యక్రమాలు భారతీయ సాహిత్యంలో సంభాషణలను, మానవత్వాన్ని బలోపేతం చేస్తాయని నొక్కి చెప్పారు. ఈ అవార్డు ప్రదానోత్సవం కేవలం ఇద్దరు రచయితలకు దక్కిన గౌరవం మాత్రమే కాదు, ఈశాన్య కొండలను , దక్షిణ తీర ప్రాంతాలను హిందీ ద్వారా అనుసంధానించే ఒక ముఖ్యమైన క్రతువు అని రుజువు చేసింది.

ఈ కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన పెద్ద సంఖ్యలో సాహిత్య ప్రేమికులు, పరిశోధకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. భారతీయ సమగ్రతకు ఈ భాషా సామరస్యం ఒక శుభపరిణామమని వారు కొనియాడారు.