Tata Punch vs Nissan Magnite Price, Features Comparison: భారత మార్కెట్లో చిన్న SUVల క్రేజ్‌ పెరుగుతున్న కొద్దీ టాటా పంచ్‌, నిస్సాన్‌ మ్యాగ్నైట్‌ లాంటి మోడల్స్‌ యూత్‌ను, ఫ్యామిలీ బయ్యర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా, కారు కొనేవాళ్లు ఎక్కువగా చిన్న సైజ్‌ SUVలు, అందుబాటు ధర, మంచి మైలేజ్‌ కోసం చూస్తుంటారు. ఈ అవసరాల్లో టాప్‌ ప్లేయర్స్‌గా నిలిచిన రెండు మోడల్స్‌ - టాటా పంచ్ & నిస్సాన్ మాగ్నైట్. మరి, ఈ రెండింటిలో ఏది మీకు బెటర్‌ ఛాయిస్‌ అవుతుందో ధరల నుండి ఫీచర్ల వరకు పోలిక తప్పనిసరి.

ధరలు
తెలుగు రాష్ట్రాల్లో, టాటా పంచ్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు సుమారు ₹6.20 లక్షల నుంచి ₹10.32 లక్షల వరకు ఉన్నాయి. నిస్సాన్‌ మ్యాగ్నైట్‌ మాత్రం కాస్త పోటీగా ₹6.14 లక్షల దగ్గరే స్టార్ట్‌ అవుతుంది, టాప్‌ వేరియంట్‌ ₹11.92 లక్షల వరకు వెళ్తుంది. అంటే బడ్జెట్‌ బయ్యర్లకు రెండూ సూటబుల్‌ ఆప్షన్స్‌.

డైమెన్షన్స్‌ & స్పేస్‌
టాటా పంచ్‌ పొడవు 3,827 mm మాత్రమే, ఇది SUV తరహాలో కనపడినా సిటీ డ్రైవ్‌కి చక్కగా సరిపోతుంది. నిస్సాన్‌ మ్యాగ్నైట్‌ పొడవు 3,994 mm. అంటే, టాటా పంచ్‌ కంటే కాస్త ఎక్కువ స్పేస్‌, కంఫర్ట్‌ ఇస్తుంది. వీల్‌బేస్‌ విషయంలోనూ మ్యాగ్నైట్‌ 2,500 mmతో అడ్వాన్స్‌డ్‌గా ఉంది.

ఇంజిన్‌ & పవర్‌ట్రెయిన్‌
టాటా పంచ్‌లో 1199cc 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 88 PS పవర్‌, 115 Nm టార్క్‌ ఇస్తుంది. మాన్యువల్‌, AMT ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి.
మ్యాగ్నైట్‌ 999cc తో రెండు ఇంజిన్‌ ఆప్షన్స్‌తో వచ్చింది - 1.0 లీటర్‌ నేచురల్‌ పెట్రోల్‌ (72 PS) & 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ (100 PS, 160 Nm). టర్బో ఇంజిన్‌తో మ్యాగ్నైట్‌ పనితీరు మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

మైలేజ్‌
మైలేజ్‌లో మ్యాగ్నైట్‌ టర్బో CVT వేరియంట్‌ లీటరుకు 17.7 km వరకు ఇస్తుంది. నాన్‌-టర్బో వెర్షన్‌ లీటరుకు 19 km వరకు ప్రయాణిస్తుంది. టాటా పంచ్‌ సుమారు 18.9 kmpl వరకు మైలేజ్‌ ఇస్తుంది. అంటే, మైలేజీలో ఈ రెండు మోడల్స్‌ దాదాపు సమానమే కానీ, మ్యాగ్నైట్‌ టర్బో స్పోర్టీగా ఉంటుంది.

ఫీచర్లు
ఫీచర్ల విషయంలో ఈ రెండు కార్లు సీరియస్‌గా పోటీ పడుతున్నాయి.

పంచ్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్‌, హార్మన్‌ ఆడియో సిస్టమ్‌, ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్స్‌, 16-అంగుళాల అలాయ్ వీల్స్‌ ఉన్నాయి.

మ్యాగ్నైట్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో/యాపిల్‌ కార్‌ప్లే, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 360 డిగ్రీ కెమెరా, కూల్డ్‌ గ్లోవ్‌బాక్స్‌ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ
టాటా పంచ్‌ గ్లోబల్‌ NCAPలో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది, ఇది చాలా పెద్ద హైలైట్‌. మ్యాగ్నైట్‌ మాత్రం 4 స్టార్‌ రేటింగ్‌తో ఉంది. రెండింట్లోనూ డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ABS, EBD, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ స్టాండర్డ్‌గా ఉన్నాయి.

మీరు సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తే, టాటా పంచ్‌ క్లియర్‌ విన్నర్‌. బడ్జెట్‌లో మంచి SUV లుక్‌, బిల్డ్‌ క్వాలిటీ కావాలంటే పంచ్‌ తీసుకోవచ్చు. కానీ.. స్పోర్టీ డ్రైవ్‌, టర్బో ఇంజిన్‌, 360 డిగ్రీ కెమెరా లాంటి ప్రీమియం ఫీచర్లను ఇష్టపడితే, నిస్సాన్‌ మ్యాగ్నైట్‌ మీకు సూట్‌ అవుతుంది.