Vijay swearing-in on Saturday is doubt: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చెన్నై వేదికగా సాగుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మరో మలుపు తిరిగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనా, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. శనివారం జరగాల్సిన ప్రమాణ స్వీకార వేడుక పై గందరగోళం నెలకొంది.

మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో..

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 తాజా సమీకరణాల ప్రకారం విజయ్ క్యాంపులో ఉన్న బలం ఇలా ఉంది:

టీవీకే (TVK): 107 (విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక సీటు తగ్గింది)
కాంగ్రెస్: 5
లెఫ్ట్ పార్టీలు (CPI & CPM): 4
మొత్తం బలం: 116

అంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కు మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అత్యవసరం. 116 మందితో క్లెయిమ్ చేసినా, గవర్నర్ మాత్రం 118 మంది సంతకాలతో కూడిన లేఖలు ఉంటేనే రండి అని కచ్చితంగా చెప్పడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.

వీసీకే, ఐయూఎంఎల్ హ్యాండ్ ఇచ్చాయా?

ఈ హైడ్రామాలో విడతలై చిరుతైగళ్ కచ్చి, ఐయూఎంఎల్ పాత్ర కీలకంగా మారింది. విజయ్ ప్రభుత్వానికి ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తాయని వార్తలు వచ్చినా, ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి మద్దతు లేఖ గవర్నర్‌కు అందలేదు. డీఎంకే కూటమిలో ఉన్న ఈ పార్టీలు, విజయ్ వైపు మొగ్గు చూపాలా వద్దా అనే ఊగిసలాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లేఖలు అందకపోవడమే విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడటానికి ప్రధాన కారణమని సమాచారం.

రిసార్ట్ పాలిటిక్స్‌కు తెరలేపిన ఈపీఎస్!

మరోవైపు, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తన ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న భయంతో వారిని రిసార్టుకు తరలించారు. ఈ క్యాంపు ' రాజకీయం వల్ల విజయ్‌కు అవసరమైన ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం సవాలుగా మారింది.

గవర్నర్ ఏమంటున్నారంటే..?

రాజ్యాంగ నిబంధనల ప్రకారం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలన్నదే గవర్నర్ అభిమతం. కేవలం మౌఖిక మద్దతు లేదా మీడియా ప్రకటనలను ఆయన పరిగణనలోకి తీసుకోవడం లేదు. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితా సమర్పించిన మరుక్షణమే ఆహ్వానం పంపుతాం అని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. అప్పటివరకు ఎటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతి లేదని తేల్చి చెప్పడంతో దళపతి టీమ్ ఇప్పుడు ఆ మ్యాజిక్ 2 కోసం వేట మొదలుపెట్టింది.

విజయ్ అభిమానులు ఇప్పటికే జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద సంబరాలకు సిద్ధమయ్యారు. కానీ, రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు మారుతుండటంతో శనివారం ఉదయం వరకు ఉత్కంఠ తప్పేలా లేదు. విజయ్ తన రాజకీయ చతురతతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు సంపాదించి సీఎం ' పీఠం ఎక్కుతారా? లేక రాజ్యాంగ సంక్షోభం వైపు రాష్ట్రం వెళ్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.