TVK alliance with the BJP in Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట , దానిపై జరుగుతున్న CBI విచారణ అత్యంత కీలకమైన అంశాలుగా మారాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి, అధికార DMKకి ,కేంద్రంలోని బీజేపీకి మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగం హాట్ టాపిక్ గా మారింది.

కరూర్ ఘటన- ఒక రాజకీయ మలుపు

సెప్టెంబర్ 2025లో కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఊహించని దెబ్బ. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ (SIT) విచారణ పక్షపాతంగా ఉంటుందని భావించిన విజయ్, సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ CBI విచారణ సాధించుకున్నారు. ఇది ఒక రకంగా DMK ప్రభుత్వాన్ని నమ్మడం లేదనే సంకేతాన్ని ఇవ్వడమే కాకుండా, కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి కేసు వెళ్లేలా చేసింది.

బీజేపీ వ్యూహం- స్నేహమా? ఒత్తిడా?

తమిళనాడులో బలపడాలని చూస్తున్న బీజేపీకి విజయ్ ఒక గొప్ప ఆయుధంలా కనిపిస్తున్నారు. విజయ్ తన తొలి రాజకీయ సభలో బీజేపీని సైద్ధాంతిక శత్రువు గా, DMKని రాజకీయ శత్రువు గా ప్రకటించారు. అయితే, అమిత్ షా ఇటీవలి తమిళనాడు పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ మాదిరిగా, తమిళనాడులో విజయ్‌ను తమ కూటమిలోకి తెచ్చుకోవడం ద్వారా DMK వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్.

CBI నోటీసులు - రాజకీయ వ్యూహమేనా?

తాజాగా జనవరి 12న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని విజయ్‌కు CBI నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా పర్యటన ముగిసిన వెంటనే ఈ పరిణామం జరగడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందనే చర్చ నడుస్తోంది. ఒకవైపు కేసు విచారణ పేరుతో విజయ్‌ను ఇరకాటంలో పెడుతూనే, మరోవైపు రక్షణ కల్పిస్తామనే హామీతో పొత్తుల దిశగా చర్చలు జరిపే అవకాశం లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయ్ సందిగ్ధత - సొంత అస్తిత్వం vs పొత్తులు

విజయ్ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, CBI విచారణను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేయడం. రెండు, డీఎంకే నుంచి ఎదురయ్యే కక్ష సాధింపు చర్యల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో) సయోధ్య కుదుర్చుకోవడం. ఒకవేళ ఆయన బీజేపీతో చేతులు కలిపితే, అది ఆయనకు ఉన్న తమిళ జాతీయవాద ముద్రను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కానీ, అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆయనకు కేంద్రం అండ అవసరమనేది విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుతానికి విజయ్ బీజేపీ గుప్పిట్లోకి వెళ్ళిపోయారని చెప్పలేము కానీ, అమిత్ షా వ్యూహం ప్రకారం విజయ్‌ను ఎన్డీఏ (NDA) వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవేళ పొత్తు కుదిరితే అది తమిళనాడులో సరికొత్త రాజకీయ కూటమికి దారితీస్తుంది. అలా కాకుండా విజయ్ ఒంటరిగానే వెళ్తే, ఈ CBI విచారణ ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.