Tamil Nadu Latest News: తమిళనాడు రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఉదయం విజయ్‌తో సమావేశం తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అంతా ఓకే అయ్యిందని ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా అనుమతి ఇచ్చేందుకు గవర్నర్ అంగీకరించడం లేదు. మ్యాజిక్ ఫిగర్‌ ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెబుతానంటూ గవర్నర్ పట్టుబడుతున్నారు. దీంతో 118 ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే పనిలో విజయ్ పార్టీ ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టకు ముందే రాజకీయాల అసలు స్వరూపాన్ని విజయ్‌ చూస్తున్నారు. తెరపై శత్రువులను తన ఎత్తులతో చిత్తు చేసిన విజయ్‌కు అలాంటి సినిమాటిక్ ట్విస్ట్‌లు తన రాజకీయం జీవితంలో ఆదిలోనే ఎదరుపడుతున్నాయి. ఇప్పటికే రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు గవర్నత్‌తో సమావేశమయ్యారు. తనకు సరిపడా బలం ఉందని అసెంబ్లీలో నిరూపించుకుంటామని చెబుతున్నా ఆయన వినడం లేదు. ఎంత మంది మద్దతు ఉందో లేఖలు అడుగుతున్నారు.

ప్రస్తుతానికి 113 మంది మద్దుతు ఉందని మరికొందరు ఫ్లోర్‌లో సహకరించేందుకు అంగీకరించారని గవర్నర్‌కు విజయ్ చెప్పుకొచ్చారు. అది జరగకపోతే 113 మందితో ప్రభుత్వాన్ని ఏలా ఏర్పాటు చేస్తావని ప్రశ్నించారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత బలనిరూపణ చేయలేకపోతే ఏంట పరిస్థితి అని నిలదీశారు. ఇలా పలు ప్రశ్నలతో విజయ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు.

అన్నింటికి సమాధానం చెప్పినా సరే గవర్నర్ ఆర్లేకర్ మాత్రం విజయ్‌కు ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లేదు. 118 మంది మద్దుతు ఇచ్చినట్టు లేఖ సమర్పించాలని పట్టుబడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న విజయ్‌ను గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రం ప్రభుత్వం గవర్నర్‌తో ఇలాంటి పనులు చేయిస్తుందని ఆరోపిస్తున్నారు.

నటుడు ప్రకాష్ రాజు, కమల్ హాసన్ కూడా గవర్నర్ తీరుపై మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకుండా ఇంకా నాన్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బలనిరూపణ చేసుకోవాల్సింది లోక్‌భవన్‌లో కాదని, అసెంబ్లీలోనే అని గుర్తు చేస్తున్నారు.

చిక్కుముడిని విప్పేందుకు వామపక్షాలు, వీసీకే నేతలు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై చర్చించారు. ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటులో సహకరించకపోతే కచ్చితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆలోచనలో ఆ రెండు పార్టీ ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటూ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ఈ రెండు పార్టీలు ఆక్షేపించాయి.