Quinton de Kock Record: ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026లో చిన్న జట్లు అద్భుతంగా రాణిస్తాయి. పెద్ద జట్లను దాదాపు ఓడించినంత పని చేస్తున్నాయి. మరోవైపు స్టార్ క్రికెటర్లు రికార్డుల వేటలో పడ్డారు. దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డి కాక్‌ మాజీ భారత కెప్టెన్ MS ధోనీ ప్రపంచ రికార్డును సమం చేశాడు. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో క్వింటన్ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో డికాక్ టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్ల రికార్డులో ధోనీతో సమం చేశాడు.

టీ20 ప్రపంచ కప్‌లో డికాక్ మొత్తం 32 వికెట్లలో భాగస్వామిగా ఉన్నాడు. ధోనీ కూడా తన టీ20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో 32 మంది బ్యాటర్లను వికెట్ కీపింగ్ ద్వారా డిస్మిసల్స్ చేశాడు. ఇప్పుడు డి కాక్ చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. నెక్ట్స్ మ్యాచ్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించవచ్చు.

T20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్ల టాప్-5 వికెట్ కీపర్లు

పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లలో పాలు పంచుకున్న వికెట్ కీపర్‌ విషయానికి వస్తే.. టాప్ లో క్వింటన్ డికాక్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. కమ్రాన్ అక్మల్ మూడో స్థానంలో, వెస్టిండీస్ దినేష్ రామదిన్ నాల్గవ స్థానంలో, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఐదవ స్థానంలో ఉన్నారు.

క్వింటన్ డి కాక్ - 32* ఔట్

MS ధోనీ - 32 ఔట్

కమ్రాన్ అక్మల్ - 30 ఔట్

దినేష్ రామదిన్ - 27 ఔట్

కుమార్ సంగక్కర - 26 ఔట్

జోస్ బట్లర్ - 26 ఔట్

కెనడాను 57 పరుగుల తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా

T20 ప్రపంచ కప్ 2026లో కెనడాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అర్ధ సెంచరీ సాధించి 59 పరుగులు చేశాడు. రయాన్ రికల్టన్ 33 పరుగులు, డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 39 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 19 బంతుల్లో 34 పరుగులు చేశారు. కెనడా బౌలర్ అంష్ పటేల్ మెరిశాడు. 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కెనడా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది. నవనీత్ ధాలివాల్ 64 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇతర బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు.