Supreme Court : న్యాయవ్యవస్థ అంటే కేవలం చట్టాలు, సెక్షన్లు, శిక్షలే కాదు. మానవత్వాన్ని గుర్తు చేసే ప్రక్రియ కూడా అని చెప్పే కీలక తీర్పు వచ్చింది. మైనర్ జీవితాన్ని ఆమె కలలను, ఆమె మానసిస్థితిని పరిగణలోకి తీసుకొని స్వేచ్ఛను ప్రసాదించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమ్మతనం కంటే ఆమెకు సహజ సిద్ధంగా లభించిన హక్కుల రక్షణకే సుప్రీంకోర్టు మొగ్గు చూపింది. 30 వారాల గర్భాన్ని తీసివేయడానికి అనుమతి ఇస్తూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్వల్‌ భూన్యాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి ఇచ్చిన తీర్పు ప్రతి ఒక్కర్నీ కదిలించింది. ఒక మైనర్‌ బాలిక, తన శరీరంలో జరుగుతున్న మార్పులను కూడా అర్థం చేసుకోలేని స్థితి ఉన్నప్పుడు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను తల్లిగా మారాలని చట్టం బలవంతం చేయలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. "ఒక మహిళను ముఖ్యంగా మైనర్‌ను ఆమె అనుమతి లేకుండా తల్లి అవ్వాలని బలవంతం చేయడం ఆమె ప్రాథమిక హక్కులను కాలరాయడమే" అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రెగ్నెన్సీని కొనసాగించడానికి ఆమె ఏ మాత్రం ఇష్టపడటం లేదని గుర్తించిన న్యాయమూర్తులు, ఆమె ఇష్టాన్ని గౌరవించాలని సూచించారు.

ఈ విచారణలో మైనర్ తరఫున వాదించిన న్యాయవాది వాదనలు కోర్టును ఆలోచింపజేశాయి. ఒక వేళ ఆ ప్రెగ్నెన్సీ కొనసాగి శిశువు జన్మిస్తే, పుట్టే బిడ్డతోపాటు ఆమె సమాజంలో చాలా వివక్ష ఎదుర్కోవాల్సి ఉంటుదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెపై పడే ముద్ర ఇద్దర్నీ జీవితాంతం వేధిస్తాయని న్యాయవాది వాదించారు. ఈ సామాజిక వివక్ష వల్ల ఆమెకు కలిగే వేదన ఆమె భవిష్యత్‌ను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు, బిడ్డకు జన్మనివ్వడం ఆమెకు ఇష్టం లేదని స్పష్టమైందని గుర్తించింది. అత్యాచారం ద్వారా లేదా పరస్పర అంగీకారం లైంగిక చర్య ద్వారా గర్భం దాల్చిందా అనే అంశం కంటే, ప్రస్తుతం ఆమె మానసిక స్థితి, ఇష్టం ఏంటనేది అత్యంత ప్రధానమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

కఠినమే కాని తప్పదు

తీర్పు ఇచ్చే సమయంలో న్యాయమూర్తులు కూడా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. 30వారాలు అంటే దాదాపు ఒక ప్రాణం రూపుదిద్దుకున్న సమయం. అటువంటి స్థితిలో గర్భస్రావానికి అనుమతి ఇవ్వడం ధర్మాసనానికి కూడా పెను సవాలుగా మారింది. "ఈ ఉత్తర్వులు జారీ చేయడం మాకు కూడా చాలా కష్టమే. కానీ మనం ఏం చేయగలం. అని జస్టిస్ నాగరత్నం వాపోయారు. పుట్టబోయే బిడ్డ కూడా ఒక జీవితమేనని అయితే గర్భం మోస్తున్న బాలిక స్వయంగా ఇంకా భరించే స్థితిలో లేదని" వారు ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ 24 వారాలకు గర్భస్రావం చేయగలిగితే, 30 వారాలకు ఎందుకు చేయకూడదు అనే ప్రశ్నను సంధిస్తూనే ఆమె ఆ గర్భాన్ని వదులుకోవడానికి ఉన్నప్పుడు చట్టం అడ్డుపడలేదని వారు భావించారు.

వైద్యులకు దిశానిర్దేశం

ఈ ప్రక్రియను అత్యంత సురక్షితంగా నిర్వహించే బాధ్యతను సుప్రీంకోర్టు ముంబైలోని జేజే ఆసుపత్రికి అప్పగించింది. వైద్యపరంగా అబార్షన్ చేయడానికి అనుమతిస్తూ ఆసుపత్రి వర్గాలు తగిన జాగ్రత్తలతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. వైద్యపరంగా ఏర్పాటు చేసిన పరిమితుల్లోనే ఈ మొత్తం వ్యవహారం జరగాలని కోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు భారత్ న్యాయ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది. చట్టం అనేది కేవలం శిక్షలకే కాదు, ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన భరోసా కల్పించడానికి కూడా ఈ తీర్పు రుజువు చేస్తుంది. ఒక బాలికకు ఆమె జీవితంపై శరీరంపై పూర్తి హక్కు ఉందని సుప్రీంకోర్టు చాటి చెప్పడం ద్వారా సామాజిక కట్టుబాట్ల కంటే మానవ స్వయంప్రతిపత్తికే పెద్ద పీట వేసింది. ఈ తీర్పు ద్వారా చిన్నారికి మళ్లీ తన సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం లభించిదని, ఆమె మనసుపై పడిన గాయాలను న్యాయస్థానం తుడిచి వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.