Supreme Court On Women Safety: దేశ రాజధాని దిల్లీలో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక నేరాలకు పాల్పడే వారి గుండెల్లో భయం పుట్టించాలని దిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరస్థుల మనసుల్లో "ఇకపై ఇలాంటి నేరానికి పాల్పడితే చచ్చిపోతాం" అనే భయం పుట్టనంత వరకు ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి నేరాలపై పోలీసుల ఉక్కుపాదం ఉండాలని స్పష్టం చేసింది.

కాలేజీలు, అక్రమ ఫుడ్ స్టాల్స్ పై దృష్టి పెట్టండి

సౌత్ దిల్లీలోని బాలికల కాలేజీలు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసును ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. నేరస్థుల కదలికలపై ప్రజలు ముందుగానే హెచ్చరించినా పోలీసులు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నేరాలను అరికట్టేందుకు తక్షణమే క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. విద్యార్థినులను వేధించే గూండాలు, దుండగులు తిరిగే కాలేజీల చుట్టూ ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించింది.

దిల్లీ వ్యాప్తంగా గుంపులు గుంపులకా మద్యం సేవించే రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాజధానిలో మహిళా భద్రత సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి 'వార్ రూమ్' ఏర్పాటు చేయడంపై వివరాలు అందజేయాలని పోలీసులను కోరింది. లైంగిక నేరస్థుల జాతీయ డేటాబేస్ సాయంతో అనుమానితులను ముందస్తుగా గుర్తించి కట్టడి చేయాలని సుప్రీంకోర్టు పోలీసులకు తెలిపింది.

ప్రజల నుంచి ఎలాంటి నిరసనలు ఎదురైనా సరే, మహిళల రక్షణ కోసం పోలీసులు మరింత కఠినంగా, కఠోరంగా వ్యవహరించాలని జస్టిస్ జేపీ పర్దివాలా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. రాబోయే నాలుగు వారాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరిస్తూ, "అందరం కలిసి పనిచేస్తేనే సమాజంలో మార్పు తీసుకురాగలం" అని ధర్మాసనం పేర్కొంది.