న్యూఢిల్లీ: ఇటీవల నీట్ పేపర్ లీక్ సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పోలీసులు లాఠీచార్జ్ చేయడం, వారిని అదుపు చేసేందుకు తీసుకున్న చర్యల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మంగళవారం (జులై 28) ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, ఎవరి తప్పిదం ఉందో తేల్చాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. పోలీసులు కచ్చితంగా విచారణ చేయవచ్చని, అయితే ప్రస్తుతం విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోర్టు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆందోళనలో పాల్గొన్న వారిలో 200 మందిపై కేసులున్నాయని, వారిలో 62 మందిపై తీవ్రమైన కేసులు నమోదైన చరిత్ర ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. 'మొదట్లో ఉద్యమం ప్రశాంతంగా సాగుతుండగా, ఒక్కసారిగా హింస చెలరేగింది. పోలీసులు కఠినంగా వ్యవహరించడం, రెండోది హింసను ప్రేరేపించాలనుకునే వ్యక్తులు నిరసనకారులలోకి ప్రవేశించడం లాంటి రెండు కారణాలు ఉంటాయి. ఒకసారి ప్రొటోకాల్ తయారైతే, బాధ్యుల్ని డిసైడ్ చేయడం సులభమవుతుందని ఆయన చెప్పారు. 'లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్, టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు మా దృష్టికి వచ్చింది. కొందరి కళ్లకు గాయాలయ్యాయని, మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారని మా వరకు వచ్చిందని సీజేఐ పేర్కొన్నారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఏమన్నారంటే
లాఠీచార్జ్ వ్యవహారంపై పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. 'పోలీసులు కోరుకుంటే హింసాత్మక వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు బలప్రయోగానికి దూరంగా ఉండటం సరైన నిర్ణయం. నిరసన సమయంలో యూనిఫాంలో లేని కొందరు పోలీసులు ఆయుధాలు పట్టుకుని అక్కడ కనిపించారు, వారు బలప్రయోగం కూడా చేశారు' అని పేర్కొన్నారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఇంకా మాట్లాడుతూ.. 'ఈ ఆందోళనలో విద్యార్థులపై జరిగిన దాడి, పోలీసుల బల ప్రదర్శనపై మాజీ ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలి. కోర్టు భవిష్యత్ చర్యల గురించి మాట్లాడటాన్ని మేం స్వాగతిస్తున్నాము. కానీ ఇలాంటి ఘటనలపై కూడా నిష్పాక్షిక విచారణ అవసరం. డిజిటల్ టెక్నాలజీ ద్వారా నిరసనకారులను గుర్తించి వారి వివరాలను బహిర్గతం చేయకుండా నిషేధం విధించాలి. ఇందులో విద్యార్థులు, చాలా మంది మైనర్లు కూడా ఉన్నారు' అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సుప్రీంకోర్టులో లేవనెత్తిన జునైద్ అంశం
సుప్రీంకోర్టులో ఒక లాయర్ బిహార్‌లో జరిగిన నిరసనల వ్యవహారాన్ని కూడా లేవనెత్తారు. బిహార్‌లో మైనర్లను, చివరికి 13 ఏళ్ల పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. అదే సమయంలో ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. 'నేను జునైద్ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను, అతడిని వేధిస్తున్నారు' అని చెప్పారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ఇది వేరే విషయమని పేర్కొన్నారు.

8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

నిరసనల వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, కేరళ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 'మహారాష్ట్ర, కేరళ, అస్సాం, యూపీ, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన కేసులు ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. భావవ్యక్తీకరణ హక్కు, జీవించే హక్కును పిటిషన్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలో పోలీసులు అధిక బలాన్ని ఉపయోగించినట్లు పిటిషనర్ స్పష్టం చేశారని’ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.