Srisailam Temple: శ్రీశైల ఖండంతో పాటూ వివిధ పురాణాల్లో నాలుగు యుగాల్లో శ్రీశైల క్షేత్రాన్ని ఎవరు ఎప్పుడు దర్శించుకున్నారో వివరాలున్నాయి

కృతయుగం or సత్యయుగం

ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాలపై నడిచింది. కృతయగంలో నారాయణుడు లక్ష్మీసమేతంగా భూమిని పాలించాడు. ఈ యుగం కాలపరిమాణం 17 లక్షల 28 వేల సంవత్సాలు అని శివపురాణం చెబుతోంది. ఈ యుగంలో బ్రహ్మదేవుడు శ్రీశైలంలో తపస్సు ఆచరించి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకున్నాడు. దక్షయజ్ఞం సమయంలో వీరభద్రుడు తాండవం చేసిన ప్రదేశం ఇదే అని చెబుతారు. అందుకు నిదర్శనంగా శ్రీశైలం క్షేత్రపాలకుడిగా వీరభద్రుడు కనిపిస్తాడు. శివుడి పరమభక్తుడైన నందికి ముక్తిని ప్రసాదించిన ప్రదేశం కూడా ఇదే అని చెబుతారు

త్రేతాయుగం

త్రేతాయుగం అంటే శ్రీ మహా విష్ణువు రాముడిగా జన్మించి రావణసంహారం చేసి రాజ్యాన్ని పాలించిన కాలం. ఈ యుగం కాల పరిమితి సత్యయుగం కన్నా తక్కువ...12 లక్షల 96 వేల సంవత్సరాలు. మొదటి యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే రెండో యుగంలో ధర్మం మూడుపాదాలపై నడిచింది. రాక్షసులు, చెడు ఆలోచనలు ఉన్న మనుషుల కారణంగా ధర్మంలో ఓ పాదం దెబ్బతిని మూడుపాదాలపై నడిచింది. ఈ యుగంలో రావణసంహారం అనంతరం..బ్రహ్మ హత్యా దోషం నుంచి విముక్తి పొందేందుకు శ్రీరాముడు శ్రీశైలం దర్శించారు. స్వయంగా రాముడు ప్రతిష్టించిన సహస్ర లింగేశ్వర స్వామిని ప్రధాన ఆలయం ముందుభాగంలో దర్శించుకోవచ్చు

ద్వాపర యుగం

శ్రీమహావిష్ణువు కృష్ణుడిగా అవతరించిన ద్వాపరయుగం కాలపరిమాణం మొదటి రెండు యుగాల కన్నా తక్కువ. 8 లక్షల 64 వేల సంవత్సరాలు సాగిన ఈయుగంలో రాజు చంద్రుడు-బుధుడు మంత్రి. ఇద్దరికీ నప్పదు..అందుకే ఈ యుగంలో ధర్మం రెండుపాదాలు దెబ్బతిని రెండు పాదాలపై నడిచి కలియుగం ప్రారంభానికి నాందిపలికింది. ఈ యుగంలో పాండవులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారని ఉంది. ఇక్కడ పాండవులు ఒక్కో లింగాన్ని ప్రతిష్టించి పూజించారని చెబుతారు.

కలియుగం

యుగాల్లో నాలుగోది కలియుగం..ప్రస్తుతం మనం ఉన్న ఈ యుగం కాలపరిమితి 4 లక్షల 32 వేల సంవత్సరాలు. ఈ యుగంలో శ్రీశైల క్షేత్రం జగద్గురు ఆది శంకరాచార్యుల వారి సాధనలకు నిలయంగా మారింది. శంకరాచార్యులవారు సౌందర్యలహరి రచించింది ఇక్కడే అని , ఛత్రపతి శివాజీ నిరాశతో ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు అమ్మవారు వీర ఖడ్గాన్ని ప్రసాదించింది ఇక్కడే అని కూడా చెబుతారు

ఆంధ్రప్రదేశ్ నల్లమల అడవుల సమీపంలో కృష్ణాతీరంలో వెలసిన పవిత్రమైన శైవ క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ( మల్లికార్జున స్వామి), అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా (భ్రమరాంబా దేవి) ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి అని పిలుస్తారు. ఇక్కడ స్వామి అమ్మవార్లతో పాటూ పాతాళగంగ, సాక్షి గణపతి, శిఖరేశ్వరం, అక్కమహాదేవి గుహలు దర్శించుకోవచ్చు. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రత్యేక ఆకర్షణలు.

భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైల క్షేత్రంలో శ్రీశైలములో అణువణువునా వ్యాపించి ఉంది, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే శ్రీశైలం దర్శనభాగ్యం కలుగుతుందని స్కాంద పురాణం, శ్రీశైల ఖండంలో ఉంది.

ఓం నమః శివాయ

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.