Special Buses for Sankranti : సంక్రాంతి సమీపిస్తుండడంతో విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - టీజీఎస్ఆర్టీసీ సైతం పండుగను పురస్కరించుకుని స్పెషల్ బస్సులు నడపనుంది. సొంతూళ్లకు క్షేమంగా వెళ్లేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సంక్రాంతి పండుగకు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ మొత్తం 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. జనవరి 10, 11, 12 తేదీల్లో ప్రయాణీకులు ఎక్కువ జర్నీ చేసే అవకాశమున్నందున.. ఈ రోజుల్లో ఎక్కువ బస్సులను నడపనుంది. పండుగ తర్వాత 19, 20 తేదీల్లోనూ తిరుగు ప్రయాణం చేసే వారి కోసం ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ లో ఈ ఏరియాల నుంచి ప్రారంభం కానున్న బస్సులు

తెలంగాణకు సెంటర్ పాయింట్ హైదరాబాద్. చాలా మంది చదువుకునేందుకైనా, ఉద్యోగం కోసమైనా వచ్చేది హైదరాబాద్ కే. కాబట్టి ఇక్కడ్నుంచి ఎక్కువ మొత్తంలో బస్సులు నడిపేలా టీజీఎస్ఆర్టీసీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా కేపీహెచ్బీ, గచ్చిబౌలి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్ లాంటి పలు ముఖ్య ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణీకులు ఇబ్బందులు కలగకుండా పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ ను అందుబాటులో ఉంచింది.

సంక్రాంతి పండుగకు టిక్కెట్ల ధరల్లో మార్పులు

పండుగలకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం టిక్కెట్ ధరలను పెంచనున్నారు. ఈ ధరలు ఈ నెల 10, 11, 12 తేదీలతో పాటు 19, 20 తేదీల్లో అమల్లో ఉండనున్నాయి. స్పెషల్ బస్సులు మినహాయిస్తే రెగ్యులర్ బస్సుల్లో మాత్రం సాధారణ ఛార్జీలే ఉంటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మహిళలు ఫ్రీగా జర్నీ చేయొచ్చని తెలిపింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం వెబ్ సైట్ www.rgsrtcbus.in లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది.

టిక్కెట్ల పెంపుకు జీవో

స్పెషల్ బస్సులకయ్యే డీజిల్ ఖర్చులు, నిర్వహణ కోసం టిక్కెట్ల ధరలు పెంచుకోవచ్చని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే బస్సుల్లో మాత్రమే రూ.1.50 వరకు టిక్కెట్ ధరలను పెంచే వెసులుబాటును ఆర్టీకి ఇచ్చింది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం కేవలం 5 రోజులే టిక్కెట్ ధరలను పెంచినట్టు టీజీఆర్టీసీ స్పష్టం చేసింది.

ఏపీలో సంక్రాంతికి 7,200 ప్రత్యేక బస్సులు

తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లోనూ సంక్రాంతికి కొత్త బస్సులు నడపనున్నారు. మొత్తం 7,200 ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ బస్సుల్లో ఛార్జీలను ఎప్పటిలాగే వసూలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. సాధారణ బస్సుల్లో ఉండే ఛార్జీలే ఈ బస్సుల్లో ఉంటాయని తెలిపింది.

Also Read : Train Ticket Rules: రైళ్లలో పిల్లలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు!, తొందరపడి టిక్కెట్‌ కొనకండి