Sobhan Babu Date Of Birth and Native Place Details: అందాల నటుడు శోభన్ బాబు పుట్టింది ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న చిన్న నందిగామ (Chinna Nandigama) అనే ఊళ్ళో .1937 జనవరి 14న ఆయన పుట్టారు. ఆయన సొంత ఇల్లు ఇప్పటికీ అదే ఊళ్ళో ఉంది. పుట్టిన ఊరు మీద మమకారంతో శేషాలయ, సూర్యాలయ పేరుతో రెండు గ్రామ చావడిలాంటి బిల్డింగులు కట్టించడంతో పాటు ఊరి పంచాయతీ కార్యాలయానికి స్థలాన్ని సైతం దానం చేశారు. ఎప్పుడు చిన్న నందిగామ వచ్చినా ఊళ్లోని స్నేహితులను కలుస్తూ సరదాగా గడిపేవారట శోభన్ బాబు. ఆయన చేసిన గుప్తదనాలు చాలా ఉన్నాయని ఊరివాళ్ళు చెప్తున్నారు. ఇంత పేరు తెచ్చిన శోభన్ బాబుకి సొంత ఊళ్ళో కనీసం ఒక్క విగ్రహమైనా లేదు. కుటుంబీకులు సొంత స్థలం ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. కానీ ఆయన విగ్రహం అక్కడ పెట్టాలన్న ఆలోచన ఆ ఊరి పెద్దలకు గానీ, స్థానిక రాజకీయ నాయకులకు గానీ లేకపోవడం విచారకరం అంటున్నారు గ్రామస్తులు. చాలా కాలంగా దాని కోసం ప్రయత్నిస్తున్నామనీ కానీ ఫలితం లేదని చెబుతున్నారు. ఎన్టీఆర్, శోభన్ బాబు ఇద్దరి విగ్రహాలు కలిపి పెట్టాలనేది వారి డిమాండ్.

తనతో పాటు తమ్ముడికి ఇళ్ళు కట్టిన శోభన్ బాబు

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతి రావు. చిన్న నందిగామకు దగ్గరలోని మైలవరంలో ఆయన చదువుకున్నారు. తర్వాత విజయవాడ, గుంటూరు ఏసీ కాలేజీల్లో చదువు పూర్తి చేసుకుని మద్రాసులో 'లా' చదువుతూనే సినిమాల్లో ప్రయత్నాలు కొనసాగించారు. 'దైవ బలం', 'భక్త శబరి' లాంటి సినిమాల్లో చిన్న పాత్రలతో పరిచయం అయిన శోభన్ బాబును హీరోగా స్థిరపరిచింది 'వీరాభిమన్యు' సినిమానే. తాను హీరోగా కెరీర్ స్థిరపడటంలో ఎన్టీఆర్ ప్రోత్సాహం ఎంతో ఉందని తన చివరి ఇంటర్వ్యూ సహా అంతకు ముందు పలుసార్లు చెప్పారు. తర్వాత స్టార్ హీరో ఎదిగిన శోభన్ బాబు సొంత ఊళ్ళో పాత ఇల్లు తీసేసి తనకు తన తమ్ముడు శివయ్యకు ఓకే మోడల్ లో రెండు ఇళ్ళు కట్టించారు. తాను సొంతూరు వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోనే ఉంటూ స్నేహితులను కలుస్తుండేవారు.

ఒకసారి గ్రామ ప్రజలు వెళ్లి పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి సాయం చేయమని కోరడంతో పాతికవేలు దానం చేశారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో స్థలం కొన్న గ్రామస్తులకు మరొక ఐదు వేలు శోభన్ బాబు ఇచ్చారు. దానితో పంచాయతీ కార్యాలయం నిర్మించి శోభన్ బాబు తండ్రి ఉప్పు సూర్యనారాయణ పేరు పెట్టారు. ఇప్పటికీ పంచాయతీ కార్యాలయం అక్కడే నడుస్తోంది. అలాగే గ్రామ కార్యక్రమాల కోసం శోభన్ బాబు తన తండ్రి, తాత పేరుతో 'సూర్యాలయ', 'శేషాలయ' అనే రెండు బిల్డింగులు కట్టించి ఊరికి దానం చేశారు. ప్రస్తుతం వినాయక చవితి లాంటి ఉత్సవాలు అక్కడే జరుగుతున్నట్టు గ్రామస్తులు చెప్పారు. ఇవి కాక ఆయన చేసిన గుప్త దానాలు చాలానే ఉన్నాయని తెలిపిన గ్రామస్తులు కనీసం ఆయన విగ్రహం ఊర్లో లేకపోవడం ఒక లోటని అన్నారు.

Also Read: 'డాకు మహారాజ్'లో 'అది చెప్పరా గాడిద...' డైలాగ్ - బాలకృష్ణ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో లైవ్ అప్డేట్స్ - సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి

తమ ఊరికి పేరు తెచ్చిన శోభన్ బాబుతో పాటు ఆయన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాలను మైలవరం నియోజకవర్గంలో ఉన్న చిన నందిగామలో నెలకొల్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దానికి స్థలం ఇవ్వడానికి శోభన్ బాబు కుటుంబీకులు రెడీ అని విగ్రహం పెడితే సరిపోతుందని వారు చెప్తున్నారు. అలా కాలం నుంచి తాము ప్రయత్నాలు చేస్తున్న నేతలు కలిసి రావడం లేదనేది వారి వాదన. శోభన్ బాబు సోదరుడు నెలన్నర క్రితం (నవంబర్ 2024)లో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన భార్య ఆయన సంపూర్ణమ్మ ఆ ఊళ్లోనే నివసిస్తున్నారు. ఆయన పిల్లల్లో ఒకరు విజయవాడలోనూ, మరొకరు చెన్నైలోనూ ఉంటున్నట్టు గ్రామస్తులు తెలిపారు.

Also Read: తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా'తో పాటు సౌత్‌లో ఫస్ట్‌ టాకీల వరకు - రెంటాల జయదేవ రాసిన 'మన సినిమా - ఫస్ట్ రీల్' బుక్ రివ్యూ