BRS sarpanches:  రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని (Legal Cell) ఏర్పాటు చేస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ, వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

ప్రతి జిల్లాలో సర్పంచుల కోసం లీగల్ సెల్ ఏర్పాటు

సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బిఆర్‌ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. "మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతాం అని ఎవరైనా అధికారులు గానీ, పాలకపక్ష నేతలు గానీ బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. వెంటనే పార్టీని సంప్రదించండి. మీ కోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది, కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదాం" అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

కేవలం రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్లు, మహిళలకు తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40 నుండి 70 శాతం స్థానాల్లో బిఆర్‌ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రజల వ్యతిరేకత నుంచి కాంగ్రెస్‌ని కాపాడలేకపోయారని కేటీఆర్ అన్నారు.

♦️ సర్పంచులను వేధిస్తే ఊరుకోం.. ప్రతి జిల్లాలో 'లీగల్ సెల్' ఏర్పాటు

♦️ కాంగ్రెస్ బెదిరింపులకు భయపడొద్దు.. న్యాయపరంగా అండగా ఉంటాం

♦️ రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

♦️ సిరిసిల్లలో నూతన సర్పంచులకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇… pic.twitter.com/fJIkjdrMEF

— BRS Party (@BRSparty) December 15, 2025

పదవి ముఖ్యం కాదు.. పనే ముఖ్యం

సర్పంచులు కేవలం పదవులను అలంకారప్రాయంగా కాకుండా, గ్రామ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని కేటీఆర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే, గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పంచాయతీరాజ్ చట్టం, విధులు, హక్కులపై అవగాహన కల్పించేందుకు నిపుణులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. మిగిలిన విడత ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు కష్టపడి గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న తెలంగాణ, కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం కైవసం చేసుకుందని, ఇది కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రికార్డును దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించలేదని అన్నారు.