Family Suicide Singarayakonda: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో అత్యంత విషాదకరమైన, సంచలనాత్మకమైన ఘటన వెలుగుచూసింది. నెల రోజుల క్రితం జరిగిన ఓ వ్యవసాయ అధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం చెందడం కలకలం రేపతోంది.

15వ తేదీన వ్యవసాయాధికారిగా పని చేస్తున్న శ్రీహరి హత్య

నెల్లూరు జిల్లాకు చెందిన వ్యవసాయాధికారి శ్రీహరి ఈ నెల పదిహేనో క్రితం దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో సదరు వ్యవసాయ అధికారికి స్వయానా బావమరిది అయిన హరికృష్ణను ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తూ వచ్చారు. చివరికి అతనే హత్య చేశాడని గుర్తించారు. హత్య జరిగినప్పటి నుండి పోలీసుల విచారణ తీవ్రమవ్వడం, అరెస్టు భయం వెంటాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిందితుడు.. కుటుంబంతో సహా ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల విచారణలో బావమరిది హరికృష్ణ చంపినట్లు గుర్తింపు

ఆత్మహత్యకు ముందు సదరు నిందితుడు తన భార్య, ఇద్దరు మైనర్ పిల్లలతో కలిసి సింగరాయకొండ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. అర్థరాత్రి దాటిన తర్వాత రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి, వేగంగా వస్తున్న రైలు కిందపడి నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తెల్లవారుజామున స్థానికులు ట్రాక్‌పై మృతదేహాలను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి, మృతుల వద్ద లభించిన గుర్తింపు కార్డులు, ఆధారాల ద్వారా వారు వ్యవసాయ అధికారి హత్య కేసుతో ముడిపడి ఉన్న నిందితుడి కుటుంబంగా గుర్తించారు.

పోలీసుల ఆలసత్వం కారణంగా మొత్తం స్టేషన్ సిబ్బంది బదిలీ

మరోవైపు, ఈ వ్యవసాయ అధికారి హత్య కేసు మొదటి నుండి పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కేసు దర్యాప్తు ప్రారంభంలో స్థానిక పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారులు నివేదికలు తెప్పించుకోగా, క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీస్ శాఖలో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు బుచ్చిరెడ్డి పాలెం పోలీస్స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని ఏకంగా 23 మంది పోలీస్ సిబ్బందిని రైటర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైల వరకు ఉన్నతాధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.

కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నిందితుడు

కుటుంబాల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు చివరకు ఇరువైపులా ఐదుగురి ప్రాణాలను బలితీసుకోవడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకవైపు హత్యకు గురైన వ్యవసాయ అధికారి కుటుంబం వీధిన పడగా, మరోవైపు నిందితుడి కుటుంబం మొత్తం నాశనమైపోయింది. సింగరాయకొండ పోలీసులు ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.