Operation Lotus 2.0 Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి అత్యంత నాటకీయమైన మలుపు తిరిగాయి. లోక్‌సభలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన విభాగానికి చెందిన ఆరుగురు పార్లమెంట్ సభ్యులు ఏకకాలంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అసలు శివసేన లో విలీనం కావాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ సమర్పించడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ తాజా తిరుగుబాటుతో కేంద్రంలోని ఎన్డీయే కూటమి బలం లోక్‌సభలో 320 మార్కుకు చేరి, మరింత పటిష్టంగా మారింది.

ఫండింగ్ ఫార్ములా.. నియోజకవర్గాల నిధుల కోసమేనా?

అసలు ఈ ఆరుగురు ఎంపీలు ఉద్ధవ్ క్యాంప్‌ను వీడటానికి గల కారణాలను ఒక తిరుగుబాటు ఎంపీ స్పష్టం చేశారు. "మీ నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు కావాలంటే, అధికార కూటమి వైపు మారక తప్పదు" అని తమకు స్పష్టమైన సంకేతాలు వచ్చాయని సదరు ఎంపీ వెల్లడించారు. విపక్షంలో ఉంటే నియోజకవర్గాలకు నిధులు రాక, ప్రజల్లో పట్టు కోల్పోయే ప్రమాదం ఉందనే భయంతోనే ఈ ఎంపీలంతా అధికార పక్షం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో గత అసెంబ్లీ సంక్షోభం తరహాలోనే ఇప్పుడు లోక్‌సభలోనూ ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి దెబ్బ తగిలింది. ఆరుగురు ఎంపీలు ఒకేసారి గ్రూప్‌గా విడిపోయి షిండే వర్గంలో విలీనం కావాలని లేఖ ఇవ్వడం వల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి వీరికి చట్టపరమైన రక్షణ లభించే అవకాశం ఉంది. ఈ పరిణామంతో లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 320 స్థానాల మార్కును దాటి మరింత సుస్థిరంగా మారింది.

#WATCH | Delhi | After meeting with Lok Sabha Speaker Om Birla, Shiv Sena UBT MP Anil Desai says, "We have given a letter to Lok Sabha Speaker stating that if any group comes to him, he should first let us know. Only a party can merge; there is no provision for a group to merge… pic.twitter.com/MHcXrCpcKK

— ANI (@ANI) June 17, 2026

ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ - ఉనికి చాటుకునే పోరాటం!

పార్టీ పేరు, గుర్తు చేజారినా.. గత ఎన్నికల్లో ప్రజల మద్దతుతో లోక్‌సభ స్థానాలను గెలుచుకుని ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ పుంజుకున్నారు. అయితే, ఇప్పుడు గెలిచిన ఎంపీలు కూడా చేజారిపోవడంతో శివసేన తీవ్ర సంక్షోభంలో పడింది. నియోజకవర్గాల నిధుల సాకుతో ఎంపీలు పార్టీ మారుతుంటే, కేడర్‌ను ఎలా కాపాడుకోవాలనేది ఉద్ధవ్‌కు పెద్ద సవాలుగా మారింది. ఏకనాథ్ షిండే ఈ పరిణామంతో మహారాష్ట్ర రాజకీయాలపై తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. రాబోయే రోజుల్లో ఉద్ధవ్ క్యాంప్ నుండి మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశం ఉందని వారు క్లెయిమ్ చేస్తున్నారు.

VIDEO | Shiv Sena (UBT) MP Sanjay Raut says, “The Aam Aadmi Party was broken, Shiv Sena was first split, then the Nationalist Congress Party was split, and now after Trinamool Congress, there is an attempt to break Shiv Sena again. Why is this happening in this country, and for… pic.twitter.com/BAHx4EW3bN

— Press Trust of India (@PTI_News) June 17, 2026

జాతీయ రాజకీయాలపై ప్రభావం

ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇరవై మంది ఎన్డీఏలో చేరారు. విపక్ష ఇండియా కూటమిలోని బలమైన భాగస్వామి అయిన శివసేన ను బలహీనపరచడం ద్వారా లోక్‌సభలో ప్రతిపక్షాల దూకుడుకు అమిత్ షా అడ్డుకట్ట వేశారు. పార్లమెంట్‌లో కీలకమైన బిల్లులు పాస్ కావాల్సి ఉన్న తరుణంలో.. ఎన్డీయే సంఖ్యాబలం 320కి పెరగడం రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల గమనాన్ని మార్చబోతోంది.