Shankaracharya Avimukteshwarananda Saraswati : ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌కు చెందిన జ్యోతిష్‌ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన ప్రకటన చేశారు. హిందూ ధర్మాన్ని, గోవంశాన్ని సంరక్షించే లక్ష్యంతో సుమారు రెండు లక్షల మందికిపైగా సభ్యులతో ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి పర్యటనలో ఉన్న ఆయన ఈ ప్రతిపాదిత సైన్యానికి చుతురంగిణి సేన అని పేరు పెట్టారు. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

చతురంగిణీ సేన - నిర్మాణం- లక్ష్యాలు

శంకరాచార్య అవిముక్తేశ్వరానంద ప్రకటించిన ఈ చతురంగిణి సేనలో మొత్తం 2.18,000 మంది సైనికులు ఉంటారు. సైన్యం కేవలం పురుషులకే పరిమితం కాకుండా మహిళలు, థర్డ్‌ జెండర్‌ వ్యక్తులకు కూడా ఇందులో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. కుల మతాలకు అతీతంగా హిందూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఈ సేనలోకి ఆహ్వానిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

చతురంగిణి అనే పదానికి అర్థాన్ని వివరిస్తూ, పురాతన కాలంలో సైన్యంలో ఉండే పదాతి దళం, అశ్వ దళం, గజ దళం, రథ దళాలను కలిపి ఈ పేరుతో పిలిచే వారని ఆయన పేర్కొన్నారు. మహాభారత కాలంలో కూడా ఇటువంటి సైన్యాల ప్రస్తావన ఉందని ఆయన గుర్తు చేశారు. హిందూ మతం, సంస్కృతి సమాజం, ప్రధానంగా గోవుల రక్షణే ఈ సైన్యం ప్రధాన ఉద్దేశమని శంకరాచార్య తెలిపారు.

ఆయుధాలు- శిక్షణ

ఈ సైన్యం కేవలం సంప్రదాయ ఆయుధాలకే పరిమితం కాదని, ఆధునిక ఆయుధాలను కూడా ధరిస్తుందని శంకరాచార్య వెల్లడించారు. వారణాసిలో జరిగిన ఈ ప్రకటన సమయంలో ఆయన అనుచరులు, కొంతమంది సాధువులు గొడ్డలి సమూనాలను ప్రదర్శించారు. సంప్రదాయ, అధునాతన ఆయుధాల మేళవింపుతో ఈ సేన పని చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మౌని అమావాస్య పర్వదినం సందర్భంగా ఈ చతురంగిణి సేను అధికారికంగా ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.

యంత్రాంగం- చట్టపరమైన సవాళ్లు

శంకరాచార్య ప్రకటనలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. లైసెన్స్ లేని ఆయుధాలను కలిగి ఉండటం లేదా బహిరంగంగా ప్రదర్శించడం చట్ట రీత్యా నేరమని సీనియర్ పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. శంకరాచార్య కార్యకలాపాలను, ఆయన చేస్తున్న ప్రకటనలను నిశితంగా గమనిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పౌర సమాజంలో ఇటువంటి ప్రైవేటు సైన్యాల ఏర్పాటు చట్టపరమైన చిక్కులకు దారి తీసే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

శంకరాచార్య పాత వివాదాలు

శంకరాచార్య అవిముక్తేశ్వరానంద గత కొంత కాలంగా వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. గత నెలలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మాఘమేళా సందర్భంగా ఆయనను తన పల్లకిలో సంగమంవైపు వెళ్లనివ్వకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై విమర్శలు చేశారు. దీనిపై సీఎం కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన నేరుగా స్పందించకుండా రామాయణంలోని కాలనేని అనే రాక్షసుడి పాత్రను ప్రస్తావిస్తూ , సాధువు వేషంలో ఉండే వారిని ప్రజలు గుర్తించాలని కామెంట్ చేశారు.

పోక్సో కేసు ఆరోపణలు

శంకరాచార్య అవిముక్తేశ్వరానందపై తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి. అశుతోష్‌ బ్రహ్మచారి మహరాజ్ అనే మరో మత గురువు ఫిర్యాదు మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన బటుక్‌పై శంకరాచార్య ఆశ్రమంలో లైంగిక వేధింపులు జరిగాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అశుతోష్ బ్రహ్మచారి ఈ వ్యవహారంలో శంకరాచార్యతోపాటు ఆయన అనుచరులు ముకుందానందా బ్రహ్మచారి, అరవింద్‌, ప్రకాశ్ ఉపాధ్యాయుల పేర్లు ప్రస్తావించారు. ఈ ఆరోపణలను శంకరాచార్య పూర్తిగా తిరస్కరించారు. సనాతన ధర్మానికి హాని కలిగించేందుకు ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. శంకరాచార్యపై ఆరోపణలు చేసిన అశుతోష్‌ బ్రహ్మచారిపై రైలు ప్రయాణంలో దాడి కూడా జరిగింది.