SBI Data Breach: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయడానికైనా, లోన్ తీసుకోవడానికైనా, కస్టమర్లు తమ వ్యక్తిగత వివరాలను బ్యాంకుకు ఇస్తున్నారు. మీ వ్యక్తిగత వివరాలు తప్పుడు చేతుల్లోకి వెళితే, అది తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇలాంటి బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. 3.75 లక్షల ఎస్‌బీఐ కస్టమర్లకు డేటా లీక్ అయిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సైబర్‌పల్స్56 అనే సైబర్‌ సెక్యూరిటీ అకౌంట్ ప్రకారం, 3.75 లక్షల బ్యాంకు అకౌంట్ల సమాచారం తమ వద్ద ఉందని పేర్కొంటూ 'సిరియస్సిమ్' అనే హ్యాకర్ గ్రూప్ ప్రకటించింది. ఈ విషయంపై ఎస్‌బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు, కానీ బుధవారం ఈ సైబర్‌దాడి గురించి బ్యాంకు ఓ ప్రకటన జారీ చేసింది.

బ్యాంకు ఏం చెబుతోంది?

3,897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయిందని ఎస్బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ప్రకారం, లీక్ అయిన డేటాలో కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తెలిందని పేర్కొంది.

ఏ డేటా లీక్ అయింది?

ఎస్‌బీఐ ప్రకారం, కస్టమర్ ఐడెంటిటీ, లోన్ రికార్డులకు సంబంధించిన వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. కస్టమర్ మొబైల్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీ, కస్టమర్ పేర్లు, ఇంటి అడ్రస్ వంటి సమాచారం డేటా లీక్ లో ఉన్నాయి.

ఏం చర్యలు తీసుకుంది?

డేటా లీక్ తీవ్రతను నిర్ధారించడానికి, ఎస్బీఐ ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం ఒక సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించింది. ఎంత మేర డేటా లీక్ అయిందో నిర్ధారించాలని కోరింది.

కస్టమర్లపై ప్రభావం?

సైబర్‌పల్స్ ప్రకారం, లీక్ అయిన కస్టమర్ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కస్టమర్ డేటాను ఉపయోగించి తప్పుడు మార్గాల్లో లోన్ అప్లై చేయవచ్చు. మరికొందరు నకిలీ మెసేజులు పంపి ప్రజలను మోసం చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. అందువల్ల, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కస్టమర్లు ఎవరికీ ఓటీపీని చెప్పకూడదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అలాగే, మీ ఏటీఎం పిన్‌ను కూడా ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. బ్యాంకు ద్వారా జరిగే ప్రతి లావాదేవీపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు.

Also Read:  రూ.30,213 కోట్ల జియో ఐపీఓ లైవ్.. సబ్‌స్క్రిప్షన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డ్

బ్యాంకుపై ఎలాంటి ప్రభావం?

డేటా లీక్ వల్ల బ్యాంకుపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని ఎస్‌బీఐ చెబుతోంది.

మీ అకౌంట్ నుంచి డబ్బు పోతే?

మీ బ్యాంక్ అకౌంట్ లో మీకు తెలియని విధంగా లావాదేవీ జరిగితే, వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలి.

అనుమానాస్పద లావాదేవీలపై సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయండి.

ట్రాన్‌జాక్షన్ ఐడీ, బ్యాంక్ SMS, ఖాతాకు సంబంధించిన వివరాలు మీ వద్ద ఉంచుకోవాలి.

నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి. అవసరమైతే దానిని బ్లాక్ చేయండి.

Also Read: IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?