Satara Doctor Crime News:  మహరాష్ట్రలో ఓ మహిళా వైద్యురాలి ఆత్మహత్య ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. సతారా జిల్లాలోని ఫల్తాన్ ఆరోగ్య ఉప కేంద్రంలో పనిచేసే డాక్టర్ సంపదా ముండే (Dr Sampada Munde) ఆత్మహత్య చేసుకున్న విషయం షాకింగ్ మలుపు తీసుకుంది. ఓ పోలీసు సబ్‌ ఇనస్పెక్టర్ తనపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడంటూ.. తన చేతిపైనే రాసుకుని చనిపోయింది. ఓ కేసు విషయంలో వైద్య నివేదికపై పోలీసులకు వైద్యురాలికి మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. వైద్య నివేదిక విషయంలో జాప్యం చేస్తున్నారంటూ పోలీసులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే తప్పుడు నివేదిక ఇవ్వమంటూ ఫల్తాన్ రూరల్ పోలీసులు తనపై ఒత్తిడి చేశారని ఆమె పోలీసు ఉన్నతాధికారలకు ఫిర్యాదు కూడా చేశారు. వారిపై చర్య తీసుకోకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని కూడా హెచ్చరించారు. చివరకు అదే జరిగింది. SI గోపాల్ బద్నే తనపై అత్యాచారం చేశాడని.. స్థానికుడైన ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తన చేతిపై రాసుకుని చనిపోయింది.

హోటల్‌లో ఆత్మహత్య

డాక్టర్‌ సంపద ఫల్తాన్ లోని ఓ లాడ్జ్‌ గదిలో ఉరేసుకుని చనిపోయారు. బుధవారం రాత్రి ఊఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. తన చేతిపై SI పేరు ఉండటంతో ఈ విషయంలో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు హోటల్ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే SI పేరు చేతిపైన రాసిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఎస్పీతో మాట్లాడిన సీఎం

మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేరుగా సతారా జిల్లా ఎస్పీతో మాట్లాడారు. జరిగిన ఘటనపై నివేదిక కోరారు. SI గోపాల్‌ బద్నేను సస్పెండ్ చేశారు. కీలక నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విషయం బయటకు వచ్చిన వెంటనే ఎస్‌ఐ గోపాల్‌తో పాటు... ప్రధాన నిందితుడు ప్రశాంత్ పరారయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్ వైద్యురాలి మృతిపై స్పందించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. పోలీసులు వేధిస్తన్నారని చనిపోయిన వైద్యురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఈ అలక్ష్యంపై కూడా విచారణ జరగాలని Women Commission Chairperson Rupali Chakankar ఆదేశాలిచ్చారు.