Sabarimala Aravana Payasam Special: ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రసాదం ప్రత్యేకం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇలా.. శబరిమల అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం కూడా చాలా ప్రత్యేకం. అక్కడ మాత్రమే దొరికే ప్రసాదం అది. అందుకే ఎవరు శబరిమల వెళ్లినా తీసుకొచ్చి అందరకీ పంచుతారు.. కొందరు ప్రత్యేకంగా తెప్పించుకుంటారు. ఈ ప్రసాదం ప్రత్యేకత ఏంటంటే ఎన్నాళ్లైనా పాడవదు.

టిన్ లో ప్యాక్ చేసి పాకంలో ఉండే అయ్యప్ప ప్రసాదాన్ని అరవణ పాయసం అంటారు. అరవణ పాయసాన్ని ఎలా తయారు చేస్తారు? ఈ ప్రసాదం ప్రత్యేకత ఏంటి? ఎన్నాళ్లైనా పడవకుండా ఎందుకు ఉంటుంది? ఇంట్లో తయారు చేసుకోవచ్చా? ఇవన్నీ తెలుసుకుందాం

అయ్యప్ప ప్రసాదమైన అరవణ పాయసం ఎన్నాళ్లైనా పాడకుండా ఉండటానికి ప్రధాన కారణం దాని తయారీ విధానం..అందులో వినియోగించే పదార్థాలలో ఉన్న గుణాలు

బెల్లం వినియోగం

అరవణలో అత్యధిక పరిమాణంలో బెల్లం వాడతారు. ఇది ఒక సహజ సంరక్షకం (natural preservative) లాగా పనిచేస్తుంది. చక్కెరతో తయారు చేసే పదార్థాలలో ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరగడానికి అవసరమైన నీరు తగ్గిపోతుంది. దీన్ని ఆస్మోటిక్ ప్రెషర్ అంటారు.

ఎక్కువ సమయం ఉడకబెట్టడం

అతి ఉష్ణోగ్రతలో గంటల తరబడి ఉడకబెట్టి తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న సూక్ష్మజీవులు పూర్తిగా నాశనం అవుతాయి. దీంతో తేమ లేకపోవడంఅరవణలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా సూక్ష్మజీవులు పెరగడానికి నీరు అవసరం. నీరు తక్కువగా ఉండడంతో సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉండదు..అందుకే పాడవదు.

కృత్రిమ సంరక్షకాలు వినియోగించరు

అరవణపాయసంలో కృత్రిమ సంరక్షకాలు ఉపయోగించరు. బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వంటి సహజ పదార్థాలు మాత్రమే వాడతారు. ఇవి కూడా దీర్ఘకాలం నిల్వ ఉండేలా సహాయపడతాయి.

వేల ఏళ్లుగా ఈ విధానంలోనే అరవణపాయసం తయారు చేస్తున్నారు..శాస్త్రీయంగా ఈ పద్ధతి సరైనది..అందుకే ఎన్ని నెలలైనా, సంవత్సరాలైనా పాడవదు. సాధారణంగా శబరిమలలో ఎలా తయారు చేస్తారంటే..బియ్యాన్ని శుభ్రం చేసి రాత్రంతా నీటిలో నానబెడతారు. ముందుగా బెల్లం తీగపాకం వచ్చేవరకూ మరిగించి..మరో పాత్రలో కొంచెం నీరు పోసి..ఆ తర్వాత నానెబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేస్తారు. బియ్యం పూర్తిగా మెత్తబడేవరకూ ఉడికిస్తారు. ఆ తర్వాత తీగపాకం వచ్చిన బెల్లం మిశ్రమాన్ని జోడించి కలుపుతారు. నీరు పూర్తిగా ఇంకిపోయి బెల్లంపాకం, బియ్యం మిశ్రమం పూర్తిగా కలిసేలా తక్కువ ఉష్ణోగ్రతపై బాగా ఉడికిస్తారు. మధ్యలో నెయ్యివేస్తుంటారు. 70 శాతం ఉడికిన తర్వాత యాలకుల పొడి చల్లుతారు. పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాల్లో నిల్వఉంచుతారు.

ఇక ఇంట్లో సింపిల్ గా తయారు చేసుకోవాలన్నా ఇదే పద్ధతి అనుసరించవచ్చు

అరవణ పాయసానికి అవసరమైన పదార్థాలు

రెడ్ రైస్
ఎండుకొబ్బరి ముక్కలు
నెయ్యి
నల్ల ఎండు ద్రాక్ష
తాటి బెల్లం
శొంఠిపొడి
యాలకులపొడి
పచ్చకర్పూరం

రెడ్ రైస్ శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. స్టౌపై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి రెడ్ రైస్ వేయండి. 5 నిముషాల పాటు రైస్ ని వేయించండి. బియ్యం కొలత ప్రకారం నీరు పోయండి. మూతపెట్టి మెత్తగా ఉడికించండి. ఆ తర్వాత బెల్లం తీసుకుని అవసరమైనంత నీరు పోసి పాకం సిద్ధం చేయండి. తీగపాకం వచ్చేవరకూ బెల్లం మరిగించి...ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నంలో జోడించి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత ఎండుకొబ్బరి ముక్కలు, నల్ల ఎండు ద్రాక్ష వేయాలి. మధ్యలో కాస్త నెయ్యి జోడిస్తూ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత శొంఠిపొడి, యాలకులపొడి, పచ్చకర్పూరం వేసి కలపాలి. చివర్లో కొద్దిగా నేయి వేసి స్టౌ ఆఫ్ చేయండి. అంతే..అయ్యప్ప స్వామి ప్రసాదం సిద్ధమైనట్టే...