Polavaram News | పోలవరం: సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం వదలడం లేదు. తాజాగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ మాయగాళ్ల వలలో చిక్కుకుని భారీగా నష్టపోయారు. ఆర్టీఏ (RTA) చలానా పేరుతో ఆయన మొబైల్‌కు వచ్చిన ఒక నకిలీ మెసేజ్‌ను నిజమని నమ్మి, అందులోని లింక్‌ను క్లిక్ చేయడమే ఆయన చేసిన తప్పిదం అయింది. అంతే ఆ లింక్ ద్వారా ఒక ప్రమాదకరమైన మాల్వేర్ యాప్ ఆయన ఫోన్లోకి చేరింది. ఫలితంగా జంగారెడ్డిగూడెంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతా నుండి ఏకంగా రూ. 12 లక్షలు నిమిషాల వ్యవధిలోనే మాయమయ్యాయి.

నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో షాక్‌కు గురైన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెంటనే అప్రమత్తమై జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల ఐపీ అడ్రస్ ట్రాకింగ్, యాప్ డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో సామాన్యుల పరిస్థితి ఏంటని పెద్ద చర్చకు దారితీసింది. సైబర్ నేరగాళ్లు ఎంతటి చాకచక్యంగా వ్యవహరిస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ చలానాలు, కేవైసీ అప్‌డేట్ లేదా గిఫ్ట్ వోచర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు. చలానాల చెల్లింపు కోసం కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు లేదా యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కాంటాక్ట్స్ మరియు ఎస్ఎంఎస్ రీడ్ పర్మిషన్లు అడిగితే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైతం మోసాలు

ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో సాధారణ పౌరులతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబసభ్యులను సైతం సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారు. వారి పేరిట స్మగ్లింగ్ బంగారం వచ్చిందనో లేక డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని చెప్పి తాము పోలీసులం, సీబీఐ, ఈడీ అధికారులం అని నమ్మించి ఆన్ లైన్ వీడియో, ఆడియో కాల్ ద్వారా బెదిరించి లక్షల నుంచి కోట్ల వరకు కాజేస్తున్నారు.