<p>హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతంతో సభ ప్రారంభమైంది. అనంతరం తొలిరోజు సభలో ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (తుంగతుర్తి), కొండా లక్ష్మారెడ్డి (చేవెళ్ల)లకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి నివాళులు అర్పించారు. వారు చేసిన సేవల్ని ఈ సందర్భంగా సభ్యులు స్మరించుకున్నారు. దివంగత నేతల కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.</p>
<p>తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రెండేళ్ల తరువాత అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూ పలకరించారు. కేసీఆర్‌ సీటు వద్దకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a> ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో సీఎం <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> వెంట పలువురు మంత్రులు ఉన్నారు. </p>