Renault Triber Price After GST 2.0 Discount: ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ ఇండియా, ఈ పండుగ సీజన్‌కు ముందు తన కస్టమర్లకు పెద్ద బహుమతి ఇస్తోంది. జీఎస్టీ 2.0 తగ్గింపు పూర్తి ప్రయోజనాలను నేరుగా తన కస్టమర్లకు అందిస్తామని ఈ కంపెనీ ప్రకటించింది. రెనాల్ట్ బ్రాండ్‌ కార్లు అంటేనే బహు చవక బేరం. కంపెనీ నిర్ణయంతో, ఇప్పుడు, GST 2.0 డిస్కౌంట్‌ కూడా అందుకుని అవి మునుపటి కంటే తక్కువ ధరలోకి మారాయి. GST తగ్గింపు ప్రయోజనాలను ఆపాదిస్తూ, తమ వాహనాల ధరను రూ. 96,000 కు పైగా తగ్గించినట్లు కంపెనీ తెలిపింది.

Renault Kwid ఇప్పుడు రూ. 4.29 లక్షల నుంచి ప్రారంభం
కొత్త GST శ్లాబ్ తర్వాత, రెనాల్ట్ చౌకైన & అత్యంత ప్రజాదరణ పొందిన కారు క్విడ్ ఇప్పుడు కేవలం 4.29 లక్షల రూపాయల నుంచి అందుబాటులో ఉంది. దీంతో పాటు, ఇదే కంపెనీకి చెందిన మరో రెండు పాపులర్‌ కార్లు Kiger & Triber కూడా ఇప్పుడు రూ. 5.76 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటాయి.

కొత్త ధరలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుంచి, అంటే దేవీ నవరాత్రుల మొదటి రోజు నుంచి (దసరా సమయంలో) అమల్లోకి వస్తాయని రెనాల్ట్ ధృవీకరించింది. అయితే, కస్టమర్లు అప్పటి వరకు ఆగాల్సిన అవసరం లేదు. తగ్గిన కొత్త ధరలతో ఈ రోజే కొత్త కారును బుక్ చేసుకోవచ్చు.

Renault Triber MPV రేటు ఎంత తగ్గింది?
రెనాల్ట్ ట్రైబర్, దేశంలోనే అత్యంత చవకైన 7-సీటర్‌ కారు. కంపెనీ దీనిని ఇటీవలే లాంచ్ చేసింది. రెనాల్ట్ ట్రైబర్ బేస్ వేరియంట్ ధరను రూ. 53,695 తగ్గించారు. అదే సమయంలో, కస్టమర్లు దాని టాప్ వేరియంట్ కొనుగోలుపై రూ. 80,195 వరకు తగ్గింపు ప్రయోజనం పొందుతారు.

Renault Kiger రేటు ఎంత తగ్గింది?
రెనాల్ట్ కిగర్ బేస్ వేరియంట్ ధరను కూడా రూ. 53,695 తగ్గించారు. దీని టాప్ వేరియంట్‌పై రూ. 96,395 వరకు ఆదా అవుతుంది. ఈ SUV ఇప్పుడు మరింత అందుబాటు ధర ఎంపికగా మారింది.

Renault Kwid: ఎంట్రీ లెవల్ కారుపై డిస్కౌంట్
రెనాల్ట్ క్విడ్ బేస్ వేరియంట్ కొన్నవాళ్లకు రూ. 40,095 డిస్కౌంట్ లభిస్తుంది. దీని టాప్-స్పెక్ వేరియంట్‌ను రూ. 54,995 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. క్విడ్, తన విభాగంలో, ధర విషయంలో అత్యంత పొదుపైన కారుగా పాపులర్‌ అయింది.

కంపెనీ స్టేట్‌మెంట్
"GST 2.0 పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం మా కస్టమర్-ఫస్ట్‌ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నిర్ణయం రెనాల్ట్ కార్లను మరింత అందుబాటులోకి తెస్తుందని & పండుగ సీజన్‌లో డిమాండ్‌ను పెంచుతుందని మేము విశ్వసిస్తున్నాం. ప్రతి భారతీయ కుటుంబానికి ఆవిష్కరణ, విలువ & నమ్మకాన్ని అందించడమే మా లక్ష్యం" అని రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరామ్ మల్లేపల్లి చెప్పారు.