Renault and Nissan New Cars In India Latest News: ఎస్ యూవీ కేట‌గిరీలో కొత్త మోడ‌ళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని రెనో, నిస్సాన్ క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఇప్ప‌టి మార్కెట్ అభిరుచుల‌కు అనుగుణంగా ఈ మోడ‌ళ్ల‌ను రూపొందించాయి. రెనో , నిస్సాన్ భారత ఆటో రంగంలోకి కొత్త SUV మోడల్స్‌తో అడుగుపెడుతున్నాయి. వీటిలో మిడ్‌సైజ్ SUVలతో పాటు 7-సీటర్ల SUVలు కూడా ఉంటాయి. రెనో తన ప్రసిద్ధ డస్టర్ రీ మోడ‌ల్ ను భారత మార్కెట్‌లో మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది, కాగా నిస్సాన్ పూర్తిగా కొత్త మిడ్‌సైజ్ SUV "కైట్" (Kait) ను తీసుకొస్తోంది. వీటి అదనంగా, రెండు బ్రాండ్‌లు తమ తమ కొత్త 7-సీటర్ల SUVలను కూడా త్వరలో లాంచ్ చేయనున్నాయి. రాబోయే రోజుల్లో భారత వినియోగదారులకు SUV విభాగంలో మరింత ఆధునికత, టెక్నాలజీ, విలాసవంతమైన ఫీచర్లతో కొత్త ఎంపికలు లభించనున్నాయి. 2025లో రెనో డస్టర్ దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి వస్తోంది. ఇందులో 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 156bhp పవర్ , 250Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ ,ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో ఈ SUV లభ్యమవుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యుయ‌ల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యానోరమిక్ సన్‌రూఫ్, హర్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్, 10-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. ఈసారి డస్టర్ మరింత ఆధునికంగా, టెక్నాలజీ పరంగా సూప‌ర్బ్ గా త‌యార‌వుతోంది.

2026లో..
నిస్సాన్ కైట్ 2026లో మ‌న దేశంలో విడుదల కానుంది. ఇది రీనో డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు, అయితే రూపకల్పన , ఫీచర్ల పరంగా ఇది మరింత ప్రీమియంగా ఉంటుంది. ఇందులో నిస్సాన్ సిగ్నేచర్ గ్రిల్, క్రోమ్ డిటైలింగ్, L-ఆకారంలోని LED DRLs ఉంటాయి. SUVలో మల్టీ డ్రైవ్ మోడ్స్, రియర్ AC వెంట్స్, 360-డిగ్రీ కెమెరా , 10.1-ఇంచ్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే వంటి అధునాతన ఫీచర్లు లభిస్తాయి. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.3-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌ను ఉపయోగిస్తారు. అయితే తర్వాత దీనిలో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా చేర్చనున్నారు.

కొత్త 7 సీట‌ర్..
రెనో తన 7-సీటర్ SUV "బోరియల్" (Boreal) ను వ‌చ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర రూ.14 లక్షల నుండి రూ.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మరోవైపు నిస్సాన్ కూడా 2027 ప్రారంభంలో తన 7-సీటర్ SUVను లాంచ్ చేయనుంది. ఇది కైట్ లాగా ఉంటుంది కానీ మరింత స్పేస్ , ఫీచర్లు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు SUVలలోనూ 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, హైబ్రిడ్ టెక్నాలజీ , AWD (ఆల్ వీల్ డ్రైవ్) సిస్టమ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా కొత్త మోడ‌ళ్ల‌తో ఈ రెండు కంపెనీలు హ‌ల్చ‌ల్ చేయాల‌ని చూస్తున్నాయి. ఈ ఏడాది, వచ్చే సంవత్సరాల్లో వరుసగా కార్ లాంచ్ లు ఈ కంపెనీల నుంచి ఉండవచ్చని తెలుస్తోంది.