విజయవాడ: నిన్నటి వరకూ ఒకలెక్క నేటి నఃండి ఒకలెక్క అన్నట్టు క్రొత్త లుక్ లోకి వచ్చేసింది ట్రైన్ నెంబర్ 12718/12717 రత్నాచల్ ఎక్స్ ప్రెస్. ఈరోజు నుండి అధునాతన LHB బోగీలతో ప్రయాణించనుంది ఈ ట్రైన్. ఇంతవరకూ ICF బో్గీలతో నడిచిన పాత రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఇకపై మనకు కనపడదు.

విజయవాడ స్టేషన్ నుండి బయలుదేరే త్రీ సిస్టర్స్ లో రత్నాచల్ ఒకటి

విజయవాడ స్టేషన్ నుండి ప్రతీ రోజూ ఉదయం బయలుదేరే విజయవాడ -విశాఖపట్నం రత్నాచల్, విజయవాడ -సికింద్రాబాద్ శాతవాహన, విజయవాడ -చెన్నై పినాకిని ఎక్స్ ప్రెస్ లను త్రీ సిస్టర్స్ గా పిలుస్తారు ప్రయాణికులు. ఈ మూడూ ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు. ప్రతీరోజూ ఉదయం విజయవాడ నుండి బయలుదేరి మళ్ళీ సాయంత్రానికి విజయవాడ వచ్చేస్తాయి. అన్నీ సెకండ్ సిట్టింగ్, AC చైర్ కార్ లతో నడిచే రైళ్లు కావడం తో వీటి టికెట్ ధరలు ఇతర ట్రైన్స్ తో పోలిస్తే తక్కువ. అందుకే ఈ మూడు రైళ్లకు డిమాండ్ చాలా ఎక్కువ గా ఉంటుంది.

అన్నవరం సత్యన్నారాయణ దేవస్థానం కొలువై ఉన్న రత్నగిరి కొండ పేరు మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ కు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారు. ఇప్పటికే గోదావరి జిల్లాల నుండి నడిచే చాలా రైళ్ళ కు LHB కోచెస్ అమర్చారు. ఈ మద్యే కాకినాడ -బెంగుళూరు శేషాద్రి కి కూడా LHB కోచెస్ వచ్చేయగా రత్నాచల్ కి కూడా మోడర్న్ కోచెస్ మార్చాలి అంటూ డిమాండ్ మొదలైంది. ఈ రోజు తో ఆ డిమాండ్ నెరవేరింది అంటున్నారు ప్రయాణికులు.

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ క్రొత్త కోచెస్ వివరాలు ఇవే

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో ఇప్పటి వరకూ చైర్ కార్ -18, AC చైర్ కార్-3,పాంట్రీ కార్ -1, సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ డీజేబుల్డ్ కోచెస్ -2 కలిపి మొత్తం 24 ICF బోగీలు ఉండేవి. ఈరోజు నుండి చైర్ కార్ -12, AC చైర్ కార్ -3,పాంట్రీ కార్ -1,జనరల్ కోచెస్ -4, సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ డిజేబుల్డ్ కోచ్ -1 పవర్ కార్ -1 కలిపి మొత్తం 22 LHB కోచెస్ ఉంటాయి.

ఏంటీ ICF... LHB బోగీల మధ్య వ్యత్యాసం ఏంటీ..

ఇప్పటి వరకూ రైళ్లలో ICF (ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ )కి చెందిన బోగీలను వాడుతున్నారు. ఇవి కాస్ట బరువుగా ఉండడం తో పాటు ప్రయాణికులకు అంత కంఫర్ట్ గా ఉండేవి కావు. మాక్సిమమ్ స్పీడ్ (110-140 kmph ) మాత్రమే ఉండేవి. అప్పట్లో రైళ్ల ఎవరేజ్ స్పీడ్ 70 వరకే ఉండేది కాబట్టి ICF కోచెస్ మన రైళ్లకు సరిపోయేవి. అయితే ఇప్పుడు ఇండియన్ రైళ్ల వేగం పెరిగింది. దానికోసం ట్రాక్ లు మొత్తం అప్ గ్రేడ్ అవుతున్నాయి. దానితో చాలా రైళ్ళ బోగీలను LHB కోచెస్ తో మారుస్తున్నారు.ఇవి బాగా లైట్ వెయిట్ గా ఉండడం తో 200kmph స్పీడ్ వరకూ ప్రయాణించగలవు.లింకే -హాఫ్ మాన్ -బుష్ (LHB కోచెస్ ) ప్యాసింజర్ ల సేఫ్టీ పరంగా కూడా ప్రామాణికమైనవి. వీటిని రెండేళ్లకొకసారి సర్వీస్ చేస్తే సరిపోతోంది. అలాగే వీటి వెడల్పు కూడా ICF కోచెస్ తో పోలిస్తే కాస్త ఎక్కువ. వీటిని దృష్టిలో పెట్టుకుని అన్ని రైళ్లను LHB బో్గీలతో మారుస్తున్నారు రైల్వే అధికారులు. అందులో భాగం గా నేటి నుండి రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కూడా న్యూ లుక్ లోకి వచ్చేసింది.

స్పీడ్ పెంచుతారా..?

విజయవాడ -విశాఖపట్నం మధ్య ఉన్న 350km ల దూరాన్ని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం 6గంటల 20 నిముషాల వ్యవధి లో దాటుతోంది. అదే దూరాన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ 4గంటల 40 నిముషాల్లో దాటుతోంది. మరీ అంత త్వరగా కాకున్నా క్రొత్త LHB కోచెస్ తో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ గతం కంటే కాస్త తొందరగా చేరేలా అధికారులు టైమ్ టేబుల్ మారుస్తారేమో చూడాలి.