Ration Card Latest News: నకిలీ రేషన్‌కార్డులు ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అల్పాదాయ వర్గాల(BPL)కు మాత్రమే చెందాల్సిన రాయితీ బియ్యం, సరుకులు పక్కదారి పడుతున్నాయని భావించిన ప్రభుత్వం...ముందుగా నకిలీకార్డుదారులను ఏరివేయాలని నిర్ణయించింది.అందులో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(PMGKAY) లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా అడుగులు వేస్తోంది. ఆదాయపన్ను చెల్లించేవారికి ఈ పథకం కింద సాయం నిలిపివేయనుంది. దీనికోసం ఐటీ(IT) విభాగం నుంచి ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వశాఖ కోరింది.

నిరుపేదలకు మూడుపూటలా ఆహారం అందించాలన్న సంకల్పంతో కేంద్రం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ అన్న యోచన పథకం కింద ఉచితంగా రేషన్ బియ్యం(Ration Rice) అందిస్తోంది. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం ఏకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1.97లక్షల కోట్లు వెచ్చిస్తోంది. కొత్త బడ్జెట్‌లో ఏకంగా రెండు లక్షల కోట్లు పైచిలుకు కేటాయింపులే చేసింది. ఇంత ఖర్చు చేసి అందిస్తున్న ఆహార ధాన్యాలు అర్హులకు కాకుండా అనర్హులకు చేరుతుండంతో కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. అనర్హులను ఏరివేయడమే ధ్యేయంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఓ ఆర్డర్ జారీ చేసింది. ఇందులో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌... వినియోగదారుల వ్యవహార మంత్రిత్వశాఖ పరిధిలోని ఆహారం, ప్రజాపంపిణీ విభాగం ఒకదానికొకటి సమాచారం పంచుకోనున్నాయి. ఆధార్, పాన్‌, మదింపు సవంత్సరం వివరాలు సమర్పిస్తే చాలు....నిర్ణిత మొత్తం కన్నా ఆదాయం ఎక్కువ కలిగిన వారి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థలో అనర్హుల వివరాల గుర్తింపులో ఈ డేటా చాలా కీలకం కానుంది. అనర్హులను గుర్తించి తర్వాత కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

Also Read: తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్ శుభవార్త- ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ

దాదాపు 150 కోట్లకు చేరువులో ఉన్న భారత్‌లో...అత్యధికశాతం పేదవారే. వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో రోజుకూలీలే ఎక్కువ మంది ఉన్నారు. వీరందరికీ సరైన ఉపాధి దొరక్క...కనీసం మూడు పూటల తిండికూడా తినలేని స్థితిలో కోట్లాది మంది ఉన్నారు. వారందరి కడుపు నింపాలన్న సంకల్పంతో నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా రేషన్ సరుకులు సరఫరా చేస్తోంది. దీనికోసం కేంద్రం దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. రైతుల నుంచి ప్రభుత్వమే ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి వాటిని మిల్లర్ల ద్వారా బియ్యంగా మార్చి పేదలకు అందజేస్తోంది. దీనికోసం ఏకంగా ఒక్కో కిలోకు దాదాపు రూ.40 రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ఏటా లక్షల టన్నుల ధాన్యం సేకరించి అటు రైతులను ఆదుకుంటోంది.

అయితే ప్రజాపంపిణీ వ్యవస్థలో ఏళ్లనాడుగా నాటుకుపోయిన అవినీతి కారణంగా ఇష్టానుసారం రేషన్ కార్డులు జారీ అయ్యాయి.అనర్హులకు సైతం పెద్దఎ్తతున కార్డులు అందజేశారు. భూస్వాములకు ,బడా వ్యాపారులకు, మోతుబరి రైతులకు సైతం రేషన్ కార్డులు ఉన్నాయి. బెంజ్‌కారులో వచ్చి రేషన్ బియ్యం తీసుకున్న ఘటనలు మనం కళ్లారా చూశాం.అలాగే బైక్‌లు, కార్లలో వచ్చి బియ్యం తీసుకుంటున్న వారిని నిత్యం చూస్తూనే ఉన్నాం. పోనీ ఆ బి‌య్యం వాడుకుంటున్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని నల్లబజార్‌లో అమ్ముకుంటున్నారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన లక్షల టన్నుల రేషన్ బియ్యం ఓడల ద్వారా ఇతర దేశాలకు తరలిపోతోంది. దీన్నంతటినీ అరికట్టాలని భావించిన కేంద్ర ప్రభుత్వం...మందుగా నకిలీ రేషన్ కార్డుదారుల ఏరివేత ప్రారంభించింది.

Also Read: ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్