రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం రంగారెడ్డిగూడలో ఒక విషాదకర సంఘటన వెలుగుచూసింది. ఊరి చివరన నిర్మానుష్య ప్రాంతంలో తల్లి మృతదేహం పక్కన రెండున్నరేళ్ల చిన్నారి రాత్రంతా ఏడుస్తూ గడిపింది. ఆదివారం తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులు చిన్నారి ఏడుపు విని అక్కడికి వెళ్లి చూడగా.. తలపై బండరాయితో మోది హత్యకు గురైన శోభ (31) అనే మహిళ మృతదేహం కనిపించింది.

భర్తతో విడిపోయి.. మరో వ్యక్తితో సహజీవనం

రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31) అనే మహిళకి పదేళ్ల కిందటే మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి సంతానం ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా మూడేన్నరేళ్ల కిందట విడిపోయిన ఆమె, నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరికి మమత అనే రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. అయితే నర్సింహులు మద్యానికి బానిస కావడం, తనతో గొడవ పడుతుండటంతో శోభ పుట్టింటికి వెళ్లి తన తల్లి వద్ద ఉంటోంది. శనివారం నాడు కొడుకుకు సైకిల్ కొనిస్తానని నర్సింహులు చెప్పడంతో ఆమె షాద్‌నగర్‌కు వెళ్లింది. సాయంత్రం వరకు అతడు రాకపోవడంతో ఆమె కోయిలకొండ ఇంటికి వెళ్లింది. కుమారుడ్ని ఇంటి వద్దే ఉంచిన శోభ మళ్లీ కుమార్తెతో కలిసి బయలుదేరినట్లు స్థానికులు తెలిపారు.

పోలీసుల దర్యాప్తు

శోభ తల్లి కరుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్‌నగర్ సీఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నర్సింహులుపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో చిన్నారి పడిన వేదన చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము మధ్యలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

బైక్‌పై 60 కిలోమీటర్లు మృతదేహంతో ప్రయాణం

ఫరూక్‌నగర్‌ మండలం రంగారెడ్డిగూడలో శోభ డెడ్‌బాడీ లభ్యమైన కేసులో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, శోభను ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేటలో హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఒక బస్తాలో కుక్కి, అత్యంత క్రూరంగా చిన్నారితో పాటు బైక్ ముందు భాగంలో పెట్టుకుని తరలించినట్లు గుర్తించారు.

సీసీటీవీ ఫుటేజీలు పరిశీలన

నిందితుడు తన రెండున్నరేళ్ల చిన్నారితో పాటు బైక్‌పై ఓ బస్తాలో ఉన్న శోభ మృతదేహంతో సుమారు 50 నుండి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మార్గమధ్యలోని సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. తన ప్లాన్ ప్రకారం చివరకు రంగారెడ్డిగూడ శివారులోని నిర్మూనుష్య ప్రాంతానికి చేరుకున్నాక, అక్కడ శోభ మృతదేహాన్ని పడేసి.. దయ జాలి లేకుండా తన రెండున్నరేళ్ల కూతుర్ని కూడా అక్కడే వదిలేసి పరారయ్యాడు.