Vijay Deverakonda Ranabaali Movie Review: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'రణబాలి'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మించారు. బ్రిటీషర్ల మీద రాయలసీమకు చెందిన ఓ యోధుడు ఎటువంటి పోరాటం చేశాడనే కథతో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించారు. ఈ సినిమా ఎలా ఉంది?

కథ (Ranabaali Story): రాయలసీమతో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో వర్షాలు చాలా తక్కువ పడతాయి. బ్రిటీషర్లకు పన్ను కట్టడానికి ప్రజల దగ్గర సరిపడా ధాన్యం లేని పరిస్థితి ఒకవైపు... కరువు మరోవైపు. భారతీయులు ఏమైనా సరే ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని తమ దేశానికి తీసుకు వెళ్ళాలని ధృడ సంకల్పంతో ఉంటాడు సర్ హెక్టార్ (ఆర్నాల్డ్ ఓస్లో).

బ్రిటీషర్ల అరాచకాలు తెలిసి సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) రగిలిపోతారు. కరువు కారణంగా కడుపు నింపుకోవడానికి కష్టపడుతున్న ప్రజలను చూసి చలించిపోతాడు. బ్రిటీషర్ల గోదాములపై దాడి చేసి ధాన్యాన్ని తీసుకువచ్చి సామాన్య ప్రజల ఆకలి తీరుస్తాడు. అది తెలిసి రణబాలి తల తీసుకు రమ్మని తమ సైనికులను పంపిస్తాడు. హెక్టార్, బ్రిటీషర్లతో రణబాలి ఎటువంటి యుద్ధం చేశాడు? అతని ప్రయాణంలో భార్య జయమ్మ (రష్మిక) పాత్ర ఏమిటి? సింగనమల కొండ మీద బ్రహ్మ మల్లన్న స్వామి (లాల్) ఏం చేశారు? రణబాలిని ముందుకు ఎలా నడిపించారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (Ranabaali Review Telugu): భారతీయులను హింసించి దేశంలోని సిరి సంపదలను దోచుకోవాలని చూసిన బ్రిటీషర్లపై యుద్ధం చేసిన వీరులు ఎంతో మంది ఉన్నారు. బ్రిటీషర్ల నుంచి సామాన్యులను విముక్తి చేయడానికి కొందరు, దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావాలని మరికొందరు యుద్ధాలు చేశారు. అది మన దేశ చరిత్ర. చరిత్రలో పోరాటాలు చేసిన యోధులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఈతరానికి ఎంత తెలుసు? అనేది ప్రశ్నార్థకమే. దేశ చరిత్రను ప్రజల ముందుకు తీసుకు రావాలని అనుకోవడం మంచి ప్రయత్నం. అందులో తప్పు లేదు. ఆ చరిత్రను ఎలా ఆవిష్కరించాం? అనేది అసలు ప్రశ్న.

ఎంతో మంది ఆకలి తీర్చినది భారతదేశం. అన్నపూర్ణ లాంటి దేశంలో కరువుకు కారణమైన బ్రిటీషర్ల మీద రణబాలి ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది క్లుప్తంగా చిత్రకథ. అయితే... ఆ యుద్ధం, బ్రిటీషర్లపై రణబాలి చేసిన పోరాటం, సినిమా ముందుకు వెళ్ళిన విధానం కొత్తగా అనిపించవు. అందుకు కారణం బ్రిటీషర్లపై పోరాటం చేసిన భారతీయ యోధుల కథను గతంలో తెరపై చూడటమే. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంలో 'సైరా నరసింహారెడ్డి' రావడం కూడా 'రణబాలి'కి కొంత మైనస్ అని చెప్పాలి. కథ పరంగా 'సైరా', 'రణబాలి' మధ్య వ్యత్యాసం ఉంది. ఈ సినిమాలో కరువుపై ఎక్కువ ఫోకస్ చేశారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. కానీ పోరాటం చేసినది మాత్రం బ్రిటీషర్లపైనే. అందువల్ల, కొన్ని పోలికలు రావడం సహజం. అయితే... హీరో హీరోయిన్ల క్యారెక్టర్లను బాగా రాశారు.

Also Read: Jailer 2 Review In Telugu - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?

'రణబాలి'గా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక పాత్రలను... వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చాలా బాగా రాశారు. లుక్ నుంచి యాక్టింగ్ వరకు ఇద్దరి నుంచి కొత్తదనం చూపించారు. క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ అంటే జస్ట్ సీన్లు, డైలాగులు మాత్రమే కాదు... ఎక్స్‌ప్రెషన్స్ నుంచి బిహేవియర్ వరకు ఎలా ఉండాలో డిసైడ్ చేయడం! ఆది బాగా చేశారు దర్శకుడు. యాక్షన్ పరంగానూ కొన్ని హై మూమెంట్స్ బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ కావచ్చు... దానికి ముందు బ్రిటీషర్లపైకి వెళ్లడం కావచ్చు... గుహలో గెరిల్లా దాడి కావచ్చు... రాహుల్ సాంకృత్యాన్ తన ట్యాలెంట్ చూపించారు. అయితే... నిడివి విషయంలో కాస్త తప్పటడుగు వేశారు. ఫస్టాఫ్ డీసెంట్ అనిపించినా... సెకండాఫ్ లెంగ్త్ ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం పేలవంగా సాగింది. అజయ్ - అతుల్ సంగీతంలో పాటలు బావున్నాయి. కానీ, ఆర్ఆర్ మాత్రం సినిమాను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. తెలుగు సంగీత దర్శకులకు లేదంటే తెలుగు ఆడియన్స్ పల్స్ తెలిసిన వాళ్ళకు నేపథ్య సంగీతం చేసే బాధ్యత అప్పగిస్తే మినిమమ్ నాలుగైదు సన్నివేశాల్లో గూస్ బంప్స్ వచ్చేలా ఆర్ఆర్ ఇచ్చేవాళ్లు. ఈ సినిమాకు అజయ్ - అతుల్ ఆర్ఆర్ బిగ్గెస్ట్ మైనస్.

Also Read: Least Eligible Bachelor Review - 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రివ్యూ: రెండు ఓటీటీల్లో 'జబర్దస్త్' బాబు కామెడీ సిరీస్ - హీరోగా హర్ష చెముడు ఏం చేశారంటే?

'రణబాలి' ప్రొడక్షన్ డిజైన్ బావుంది. స్వాతంత్ర్యానికి ముందు వాతావరణాన్ని తెరపై బాగా ఆవిష్కరించారు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. మైత్రీ మూవీ మేకర్స్ సైతం బాగా ఖర్చు చేశారు. ఒక్క సముద్రంలో పడవ సీన్ సీజీ వర్క్ తప్ప మిగతా సినిమా అంతా ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ కూడా బావుంది.

నటుడిగా విజయ్ దేవరకొండ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇంతకు ముందు చేసిన సినిమాలు గుర్తు రాకుండా తన నటనలో కొత్తదనం చూపించారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో నట విశ్వరూపం చూపించారు. నిజంగా పోతులయ్య పూనినట్టు చేశారు. జయమ్మగా రష్మిక నటన బావుంది. బ్రహ్మ మల్లన్న పాత్రలో మలయాళ నటుడు లాల్ గెటప్, ఆయన నటన 'మగధీర'లో రావు రమేష్ ను గుర్తు చేస్తాయి. హీరో తల్లిగా ఈశ్వరి రావు, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

Ranabaali Verdict: విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని 'రణబాలి'లో చూడొచ్చు. మల్లన్న స్వామి పూనినట్టు పతాక సన్నివేశాల్లో తాండవం చేశారు. రూరల్ మాస్ యాక్షన్ డ్రామాలు సైతం తాను చేయగలనని చాటి చెప్పారు. విజయ్ దేవరకొండ, రష్మిక జోడీతో పాటు వాళ్ళిద్దరి సన్నివేశాలూ బావున్నాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కథలో కొత్తదనం లేదు. కానీ, కథనంలో కొన్ని 'హై' మూమెంట్స్, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయి. అయితే, ఆర్ఆర్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ సినిమాను మరీ తీసిపారేయలేం. అంచనాలు తక్కువ పెట్టుకుని వెళితే విజయ్ దేవరకొండ నటన నచ్చుతుంది.

రేటింగ్: 2.5/5

Also Read: EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్