Telangana Rains News Update | అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.

ఏపీలో బుధవారం వర్షాలు

ఏపీలో బుధవారం నాడు అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ పడే అవకాశముందని తెలిపారు.

ఇక మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం విషయానికొస్తే, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 70 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా పీ.గన్నవరంలో 64 మిల్లీమీటర్లు, మలికిపురంలో 66.5 మిల్లీమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా మురుటూరులో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆయన పేర్కొన్నారు.

రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
•అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, pic.twitter.com/e8DLC0o0I1

— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 16, 2025

తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాల తీవ్రత దృష్ట్యా ఆయా జిల్లాల అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు, సముద్ర మట్టానికి సగటుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 17వ తేదీన ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకుని, జోరుగా వర్షం కురిసే పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. క్యుములోనింబస్ మేఘాల ఏర్పాటుతో, సాయంత్రం గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.