<p>హైదరాబాద్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇక్కడ అభివృద్ది ఎంత వేగంగా జరుగుతోందో అంతే వేగంగా జనాభా కూడా పెరుగుతున్నాయి. దేశవిదేశాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ ఉద్యోగ,వ్యాపారాల్లో స్థిరపడిపోతున్నారు. దీని కారణంగా హైదరాబాద్‌లో ఉన్న రవాణా వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్‌లపై ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంది. అందుకే రైల్వే శాఖ ఎప్పటి నుంచో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను సిద్ధం చేసింది. సికింద్రాబాద్ నుంచి చాలా రైళ్ల గమ్యస్థానాలను ఇక్కడకు తరలించారు. ఇది విజయవంతం కావడంతో ఇలాంటి ప్రతిపాదనలు మరిన్ని తెరపైకి తీసుకొచ్చింది రైల్వేశాఖ. </p>
<p>హైదరాబాద్‌పై ట్రాన్స్‌పోర్టు ఒత్తిడి తగ్గించేందుకు ట్రిపుల్ ఆర్‌ నిర్మిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు హైదరాబాద్‌లోకి రాకుండా అక్కడే సరకులు అన్‌లోడ్ చేసి ఇతర్రాష్ట్రాలకు వెళ్లిపోతాయి. దీంతో హైదరాబాద్‌ రోడ్లపై ఒత్తిడి తగ్గుతుంది. భారీ సరకు వాహనాలే కాకుండా ట్రావెల్స్‌కి ఇదే వర్తింపజేస్తారు. ఇది రోడ్డు రవాణా వరకు దొరికిన పరిష్కారం. ఇప్పుడు రైల్వే శాఖ కూడా ఇలాంటి పరిష్కార మార్గాలను గుర్తించింది. ట్రిపుల్ ఆర్, ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య చర్లపల్లిలాంటి టెర్మినల్స్ హైదరాబాద్ చుట్టుపక్క నిర్మించాలని భావిస్తోంది. </p>
<p>హైదరాబాద్ నాలుగువైపుల నిర్మించనున్న టెర్మినల్స్‌ గురించి ముఖ్యమంత్రితో రైల్వే శాఖ చర్చించింది. వీటి వల్ల హైదరాబాద్‌ మీదుగా వివిధ ప్రధాన నగరాలకు వెళ్లే రైల్వేలు టెర్నినల్స్ వద్దే ఆగిపోతాయి. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లపై ఒత్తిడి తగ్గుతుందని వారి ప్లాన్. ఇలాంటి రైల్వే టెర్మినల్స్‌ మెట్రో నగరాల్లో ఉన్నాయి.</p>
<p>హైదరాబాద్‌లో కూడా చర్లపల్లి రూపంలో ఒకటి నిర్మించారు. రెండోది నాగులపల్లి టెర్మినల్‌ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు మరో రెండింటిని కూడా రైల్వే శాఖ ప్రతిపాదించింది. బెంగళూరు వెళ్లేందుకు కొత్త టెర్మినల్‌ జూకల్- శంషాబాద్‌లో , నాందేడ్‌ వెళ్లే వాహనాల కోసం డబిల్‌పుర్‌ మేడ్చల్‌ వద్ద కొత్త టెర్మినల్‌ నిర్మించాలని భావిస్తోంది. వీటిపైనే ముఖ్యమంత్రితో రైల్వేశాఖ ఉన్నతాధికారులు చర్చించారు. </p>