Railway Mobile Charging Ban: రాత్రివేళల్లో రైళ్లలో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. రాత్రి 11:00 గంటల నుండి ఉదయం 5:00 గంటల వరకు రైలు కోచ్‌లలోని మొబైల్, లాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లను క్లోజ్ చేసి ఉంచాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది. ప్రయాణికుల రక్షణ, రైలు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

పాత నిబంధనే.. కానీ!

వాస్తవానికి రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లను ఆపివేయాలనే నిబంధన కొత్తదేమీ కాదు. రైల్వే బోర్డు 2014 జూన్ 19న జారీ చేసిన ఉత్తర్వులను అక్టోబర్ 26న విడుదల చేసిన లేఖ ద్వారా తిరిగి గుర్తుచేసింది. ఈ నియమాన్ని అమలు చేయడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని, ఏ జోన్‌లోనూ మినహాయింపులు ఇవ్వమని జనరల్ రైల్వేలకు స్పష్టం చేసింది. నిబంధనలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూసేందుకు అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది.

'పవర్ బ్యాంక్' ఘటనతో

ఇటీవల సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో జరిగిన ఓ ఘటనే రైల్వే బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమైంది. నిర్దేశించిన సమయం దాటిన తర్వాత కూడా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉండటంతో, ఒక ప్రయాణికుడు పెట్టిన పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అవుతుండగా ఒక్కసారిగా పేలిపోయి భారీగా పొగలు వచ్చాయి. అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పినప్పటికీ, రాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రపోతున్నప్పుడు ఛార్జింగ్ వల్ల ఓవర్ హీటింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని అధికారులు ఛార్జింగ్ నిబంధనలు కఠినతరం చేశారు.

Also Read:  45 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యం?.. రైల్వే, బీమా కంపెనీలకు నష్టం రాదా?

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలు వరకు ఛార్జింగ్ పాయింట్లు పనిచేయవు కాబట్టి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల రైల్వే శాఖ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది.

ప్రయాణానికి బయలుదేరే ముందే లేదా రాత్రి 11 గంటలకు ముందే మొబైల్ ఫోన్లు, డివైజ్‌లను పూర్తిగా ఛార్జ్ చేసుకోవడం మంచిది.

ప్రయాణంలో పవర్ బ్యాంక్‌లను వెంట తెచ్చుకోవచ్చు, కానీ ఛార్జింగ్ సమయంలో పొగలు లేదా అధిక వేడిని గమనిస్తే వెంటనే సిబ్బందికి సమాచారం అందించి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ నిబంధనల పర్యవేక్షణపై సంబంధిత రైల్వే సిబ్బందికి ప్రత్యేక సూచనలు, శిక్షణ ఇవ్వాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

Also Read:  దీపావళి స్వీట్లు అడిగితే.. రూ.70 కోట్ల ట్యాంకర్ ఆర్డర్.. వైరల్ ప్రాంక్‌కు స్విగ్గీ స్వీట్ ఎండింగ్