దుబాయ్: ఖతార్‌లోని ఒక ప్రధాన గ్యాస్ ఎక్స్‌పోర్ట్ టెర్మినల్‌లో ఆదివారం (జూన్ 21న) రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 60 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరో 18 మంది ఆచూకీ తెలియరాలేదు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 12 మంది భారతీయులే అని నిర్దారించారు. ఒకరు పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తి అని అధికారులు తెలిపారు. ఇరాన్ దాడి తర్వాత రఫ్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలో మూతపడిన ఈ ప్లాంట్‌ను తిరిగి పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. మరణించిన వారిలో భారత్, పాకిస్తాన్‌కు చెందిన పౌరులు మాత్రమే ఉన్నారు.

12 మంది భారత పౌరులు మృతి
ఖతార్‌లోని గ్యాస్ టెర్మినల్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయింది ఎవరో మొదట తెలియలేదు. చనిపోయిన 13 మందిలో 12 మంది భారతీయులు కాగా, ఒకరు పాక్ సంతతికి చెందిన వ్యక్తి ఉన్నారని ఒకరోజు తరువాత అధికారులు ప్రకటించారు. భారత్, పాకిస్తాన్‌ దేశాలకు చెందిన చాలా మంది ప్రజలు చాలా భారీ సంఖ్యలో ఖతార్‌లో పనిచేస్తుంటారు. న్యూస్ ఏజెన్సీ 'అసోసియేటెడ్ ప్రెస్' నివేదిక ప్రకారం.. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న బర్జన్ గ్యాస్ సప్లై ఫెసిలిటీలో ఆదివారం రాత్రి పేలుడు సంభవించింది. జరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. ఈ ప్రమాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ మార్కెట్‌లో కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ఈ ప్లాంట్ ప్రతిరోజూ దాదాపు 1.4 బిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసి పలు దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఖతార్ ఈ గ్యాస్‌ను ప్రధానంగా తన దేశంలో విద్యుత్ తయారు చేయడానికి, తాగునీటి ప్లాంట్లను రన్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఈ ప్లాంట్ యాజమాన్య హక్కులు ఖతార్ ప్రభుత్వ సంస్థ అయిన ఖతార్ ఎనర్జీ చేతిలో ఉన్నాయి. కొద్దిపాటి వాటా అమెరికా కంపెనీ 'ఎక్సాన్‌మొబిల్' వద్ద ఉందని సమాచారం.

అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మూతపడటంతో ఖతార్ తన గ్యాస్ నౌకలను బయటకు పంపలేకపోయింది, అందుకే ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడు యుద్ధం ముగియడం, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలో ఖతార్ ఈ గ్యాస్ టెర్మినల్‌ను ఓపెన్ చేయాలని ప్రయత్నించగా భారీ పేలుడు సంభవించినట్లు ఖతార్ ఇంధన శాఖ మంత్రి షెరిదా అల్ కాబీ సోమవారం (జూన్ 22 న) తెలిపారు.

మళ్లీ ఎల్‌పీజీ కొరత
ఈ పేలుడు కారణంగా మరోసారి గ్యాస్ సంక్షోభం ఏర్పడే సూచనలు ఉన్నాయి. యూరప్, ఆసియాలోని పలు దేశాలు తమ ఇంధన, విద్యుత్ అవసరాల కోసం పూర్తిగా ఖతార్ గ్యాస్‌పైనే ఆధారపడతాయి. యుద్ధం కారణంగా ఖతార్ నుండి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పరిస్థితులు సద్దుమణిగి ఖతార్ ఎగుమతులు మళ్లీ మొదలవుతాయని భావిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.