Punjab Crime News: పంజాబ్‌లోని తరణ్‌ తారన్‌ లా కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. విద్యార్థినిని కాల్చి చంపిన తోటి విద్యార్థి ఆపై తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. క్లాస్ రూంలో ఒకరి హత్య, మరొకరు ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయడంతో కాల్చి చంపాడని ప్రచారం జరుగుతోంది. హత్యకు ముందు వారిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు అనేది తెలియాల్సి ఉంది. కాలేజీలోకి ఆయుదాలు తీసుకురావడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

సందీప కౌర్ (20) అనే విద్యార్థిని Tarn Taran లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నిందితుడు అభిరాజ్ సింగ్ (ప్రిన్స్ రాజ్ సింగ్‌) సైతం అదే క్లాస్ విద్యార్థి. అప్పటివరకూ క్లాస్ రూం చాలా ప్రశాంతంగా ఉంది. విద్యార్థులు అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతలో నిందితుడు అభిరాజ్ సింగ్ తుపాకీతో క్లాం రూంలోకి వచ్చాడు. సందీప్ కౌర్ తన స్నేహితురాలితో కలిసి బెంచ్‌పై కూర్చుంది. నిందితుడు ఆమెతో కొంతసేపు ఏదో విషయంపై వాగ్వాదానికి దిగాడు. ఒక్కసారిగా తుపాకీ తీసి తన క్లాస్ మేట్ తలపై కాల్చాడు. ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. జరిగిన విషయానికి మరో విద్యార్థిని షాకైంది. అంతలోనే నిందితుడు అభిరాజ్ సింగ్ సైతం అదే తుపాకీతో తన తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తుపాకీ పేలుడు శబ్ధాలు విన్న తోటి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. తలకు గురిపెట్టి కాల్చడంతో ఆమె మెదడు చిట్లిపోయి, క్షణాల్లోనే అక్కడికక్కడే మరణించింది. వెంటనే బాలిక ఫ్రెండ్ బయటకు పరుగులు తీసి కాలేజీ మేనేజ్‌మెంట్ కు విషయం చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాలేజీలో పిల్లలకు రక్షణ లేదు

ఘటన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీలో పిల్లలకు రక్షణ లేదని ఆరోపించారు. విద్యార్థి తుపాకీతో వెళుతున్నా కూడా ఎవరూ చూడలేదు. ఆమె కుమార్తె తోటి విద్యార్థితో గొడవ పడిందని, ఆమెకు గాయాలయ్యాయని చెప్పారు. వారు కాలేజీకి వెళ్లి చూడగా బుల్లెట్ తగిలి కూతురు దారుణస్థితిలో చనిపోయి ఉందని గుర్తించిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన కూతురు తుపాకీ తూటాకు బలైపోతుందని వారు ఊహించలేకపోయారు.

కాలేజీలోకి తుపాకీ ఎలా వచ్చింది, పోలీసుల విచారణ

ఏసీపీ జగ్‌బీర్ మీడియాతో మాట్లాడారు. అప్పటికి క్లాస్ ఇంకా ప్రారంభం కాలేదు. బాలిక తన స్నేహితురాలితో కలిసి బెంచ్ మీద కూర్చుని ఉంది. ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరగడంతో సందీప కౌర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయింది. వెంటనే ఆ యువకుడు తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఒకరు హత్యకు గురికాగా, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కాలేజీలోకి తుపాకీ ఎలాం వచ్చింది, విద్యార్థికి తండ్రికి లైసెన్స్ ఉన్న తుపాకీ ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.