Who Is More Secretive Man or Woman : సమాజంలో ఒక సాధారణంగా ఓ ప్రచారం ఉంది. ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజయినా ఉండదని అంటారు. అంటే మహిళలకు ఏదైనా విషయం తెలిస్తే దాచుకోలేరని దాని అర్థం. ఈ అభిప్రాయం సినిమాలు, జోకులు, సామాజిక మీడియాలో తరచుగా కనిపిస్తుంది. కానీ, మానసిక శాస్త్రవేత్తలు, పరిశోధనలు ఈ విషయంపై ఏమంటున్నాయి? ఈ స్టీరియోటైప్ వాస్తవమా లేక మిత్ మాత్రమేనా? ఇలాంటి విషయాలను ఇక్కడ డీకోడ్ చేద్దాం.

సమాజంలో మహిళలు "గాసిప్" చేస్తారు, రహస్యాలు బయటపెడతారు అనే భావన బలంగా ఉంది. ఒక పాపులర్ సర్వే ప్రకారం మహిళలు రహస్యాన్ని 47 గంటలు మాత్రమే దాచుకుంటారు అని తేలింది. కానీ, ఈ స్టడీలు కచ్చితమైనవి కావని అంటున్నవాళ్లు ఉన్నారు. Quora వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ అంశంపై చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయి.

స్టాన్‌ఫర్డ్ మెడిసిన్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, మహిళల మెదడులోనే గలగల మాట్లాడే తత్వం పురుషులతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 2014లో చేసిన అధ్యయయనంలో 428 మంది మగవారి, 521 మంది స్త్రీల మెదడులను పరీక్షించగా, స్త్రీల మెదడుల్లో రెండు భాగాల మధ్య సంకేతాలు చాలా బలంగా ఉంటున్నట్లు గుర్తించారు.

ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావం

కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రముఖ మానసిక శాస్త్రవేత్త డాక్టర్ మైకల్ స్లేపియన్ తన దశాబ్దకాలం పరిశోధనల ద్వారా రహస్యాల మనస్తత్వశాస్త్రంపై కీలక విషయాలు వెల్లడించారు. సాధారణ వ్యక్తి ఏ సమయంలోనైనా సరాసరిగా 13 రహస్యాలు దాచుకోగలడు. వీటిలో 5 రహస్యాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉన్నట్టు తేలింది. మహిళల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ స్రావం ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్ సామాజిక బంధాలు, విశ్వసనీయత,భావోద్వేగ సంబంధాలను పెంచుతుంది. ఇది మహిళలను ఇతరులతో భావనలను పంచుకోవాలని ప్రేరేపిస్తుంది. ప్రకృతిలో ఈ హార్మోన్ మాతృత్వ ప్రవృత్తిని, సహకారాన్ని, సామాజిక అనుబంధాలను బలపరుస్తుంది.

సామాజిక అనుబంధాల అవసరం

స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మహిళలు సహజంగానే భావోద్వేగ గుర్తింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడంలో, తమ భావాలను నియంత్రించడంలో, ఉపయోగించి ఆలోచనలను మార్గనిర్దేశం చేయడంలో అధిక సామర్థ్యం కలిగి ఉంటారు. ఎండీవర్ హెల్త్ న్యూరాలజిస్ట్ డాక్టర్ స్టీవెన్ మేయర్స్ ఈ విషయంపై పరిశోధనలు చేసి, "మహిళల మెదడుల్లో సాధారణంగా వెర్బల్ సెంటర్లు రెండు వైపులా ఉంటాయి, అయితే పురుషుల మెదడుల్లో ఇవి ఎడమ వైపున మాత్రమే ఉంటాయి. దీని ఫలితంగా మహిళలు సామాజిక పరిజ్ఞానం, మాట్లాడే సామర్థ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు.".

పరిణామాత్మక దృక్పథం

ఆక్స్‌ఫర్డ్ హ్యాండ్‌బుక్ ఆఫ్ గాసిప్ అధ్యయనం ప్రకారం, మహిళలు పరిణామ ప్రక్రియలో సమాచార మార్పిడిని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటారని తేలింది. కొన్నిసార్లు గాసిప్ ,రహస్యాలు పంచుకోవడం బంధాలను బలపరుస్తుంది, సహకారాన్ని పెంపొందిస్తుంది. రాబిన్ డన్‌బార్ సిద్ధాంతం ప్రకారం, భాష పరిణామంలో గాసిప్ ప్రధాన పాత్ర పోషించింది. పెద్ద సమూహాలలో సామాజిక బంధాలను కొనసాగించడానికి గాసిప్ అవసరమైందని వివరించారు.

వాసోప్రెసిన్ హార్మోన్ వ్యత్యాసాలు

టెన్నెస్సీ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం, వాసోప్రెసిన్ హార్మోన్ స్రావంలో లింగ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. సాధారణంగా పురుషుల్లో వాసోప్రెసిన్ స్రావం ఎక్కువగా ఉంటుంది, అయితే మహిళల్లో వాసోప్రెసిన్ V2 రిసెప్టర్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ హార్మోనల్ వ్యత్యాసాలు సామాజిక ప్రవర్తనలో మార్పులకు దారితీస్తాయి.

భావోద్వేగ ప్రాసెసింగ్‌లో వ్యత్యాసాలు

కొలంబియా యూనివర్సిటీ అధ్యయనాలు మహిళలు భావోద్వేగ నియంత్రణలో వేరే విధానాలను అవలంబిస్తున్నట్లు వెల్లడించాయి. మహిళలు ప్రతికూల భావాలను తగ్గించడానికి వెంట్రల్ స్ట్రియాటల్ రీజియన్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వారిని ఇతరులతో భావాలను పంచుకోవాలని ప్రేరేపిస్తుంది.

ప్రాగ్మాటిక్ కారణాలు

కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, మహిళలు గతంలోని గాయాలు, లైంగిక అనుభవాలను ఎక్కువగా దాచుకుంటారు. ఫ్రంటియర్స్ ఇన్ న్యూరో సైన్స్‌ జర్నల్ అధ్యయనాల ప్రకారం, మహిళల మెదడుల్లో లింబిక్-థాలమో-కార్టికల్ సర్క్యూట్‌లో లింగ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. ఈ వ్యత్యాసాలు భావోద్వేగ నియంత్రణ, విషయ విశ్లేషణలో మార్పులకు దారితీస్తాయి. మహిళలు ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటారని ఫ్రంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరో సైన్స్ అధ్యయనం వెల్లడించింది. ఇదే సామాజిక చర్యల్లో ఎక్కువ భాగమయ్యేలా చేస్తుంది.

నెదర్లాండ్స్‌లో జరిపిన లాంగిట్యూడినల్ అధ్యయనంలో 149 మంది అబ్బాయిలు ,160 మంది అమ్మాయిలను నాలుగు సంవత్సరాల పాటు పరీక్షించారు. అమ్మాయిలలో రహస్యాలు దాచుకోవడంలో వయసుతోపాటు చాలా తేడాలు కనిపించాయి. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలలో రహస్యాలు, తల్లిదండ్రుల సంబంధ నాణ్యత మధ్య బలమైన సంబంధాలు ఉన్నట్లు తేలింది.

నైజీరియాలో జరిపిన సర్వేలలో విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. "పురుషులు తమకు తెలిసిన రహస్యాలను బయటకు పోనివ్వరు. సాధారణంగా మహిళలతో పోల్చితే తక్కువ మాట్లాడటమే దీనికి ప్రధాన కారణం. మహిళలు గొడవ పడినప్పుడు వారిలో మొదట చేసే పని ఒకరి రహస్యాలను మరొకరు బయటపెట్టడమే". అని తేలింది.

మానసిక శాస్త్రవేత్తల సూచనలు

డాక్టర్ మైకల్ స్లేపియన్ తమ పుస్తకం "ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ సీక్రెట్స్"లో వివరిస్తూ, రహస్యాలను దాచుకోవడం కంటే వాటి గురించి ఆలోచించడమే ఎక్కువ మానసిక ఒత్తిడికి దారితీస్తుందని చెప్పారు. వారి అధ్యయనాల ప్రకారం, 50,000 మందితో చేసిన పరిశోధనలలో రహస్యాలను 38 రకాలుగా వర్గీకరించారు. "మహిళలు రహస్యాలను ఇతరులతో ఎక్కువగా కాన్ఫైడ్ చేస్తారు, పురుషులు తక్కువగా చేస్తారు. ఇది మహిళలు ఎక్కువ రహస్యాలు దాచుకోలేరని కాదు, కానీ వారు ఎమోషనల్ సపోర్ట్ కోసం పంచుకుంటారు" అని స్లెపియన్‌ పేర్కొన్నారు

మహిళలు రహస్యాలను దాచుకోలేరనే జనరలైజేషన్‌ సమాజంలో మహిళలపై అసమానతను పెంచుతాయని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏదైనా విషయం మహిళలు ఎక్కువ కాలం దాచుకోలేరనేది పరిస్థితిని బట్టి భావోద్వేగాన్ని బట్టి మారుతుందని చెబుతున్నారు. వారు ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి విషయాలు బయటకు వెళ్లే అవకాశం ఉందని తేల్చారు. అయితే రహస్యాలు దాచుకోవడం కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అనేక స్టడీలు చెబుతున్నాయి.

మహిళలు రహస్యాలను దాచుకోలేకపోవడానికి మెదడు నిర్మాణం, హార్మోనల్ వ్యత్యాసాలు, సామాజిక అవసరాలు, పరిణామాత్మక కారకాలు కారణమవుతున్నాయి. ఇది వారి బలహీనత కాదు, బదులుగా వారి సామాజిక బంధాలను బలపరిచే సహజ లక్షణం. రహస్యాలను ఎప్పుడు, ఎవరితో పంచుకోవాలో తెలుసుకోవడం మానసిక ఆరోగ్యానికి అవసరం.