Bihar Police Bust New Scam: ఫోన్లకు ఫేక్ లింక్స్ పంపి డబ్బులు దోచేయడం, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులతో అధిక రాబడులు, అధిక వడ్డీ, ఆన్‌లైన్ లోన్ల పేరిట మోసాలు, డిజిటల్ అరెస్టులు, హనీట్రాప్ ఇలా ఎన్నో విధాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంతగా అప్రమత్తం చేస్తున్నప్పటికీ రోజురోజుకూ కొత్త కొత్త పంథాల్లో వారి మోసాలు కొనసాగుతున్నాయి. అయితే, బీహార్‌లో (Bihar) ఇప్పటివరకూ ఎక్కడా చూడని స్కామ్ వెలుగుచూసింది. సంతానం లేని స్త్రీలను గర్భవతులను చేస్తే భారీ మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చని ప్రకటనలు గుప్పించింది. ఇది నిజమని నమ్మిన బాధితుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఈ తరహా మోసాలపై వరుసగా ఫిర్యాదులు అందడంతో విచారించిన పోలీసులు పలువురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. బిహార్‌లోని నవడా జిల్లాలో ఈ స్కామ్ వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని నవడా జిల్లాలో 'ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్', 'ప్లేబాయ్ సర్వీస్'ల పేరిట ఫేస్‌బుక్‌లో ముఠా సభ్యులు ప్రకటనలు ఇచ్చారు. పిల్లలు లేని స్త్రీలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు పొందొచ్చని ప్రకటించారు. ఒకవేళ వారు విఫలమైతే రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ పొందొచ్చని చెప్పారు. దీంతో ఆకర్షితులైన కొందరు ఈ ముఠాను సంప్రదించారు. తొలుత బాధితుల నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ఫీ, ఇతర వివరాలు సేకరించారు. అనంతరం, రిజిస్ట్రేషన్, హోటల్ గదుల బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. ఒకవేళ బాధితులు ఇవ్వకుంటే వారిని బ్లాక్‌మెయిల్ చేసేవారు. దీనిపై వరుసగా బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్‌లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద బాధితుల వాట్సప్ ఛాట్, కస్టమర్ ఫోటోలు, ఆడియో రికార్డింగ్స్, బ్యాంక్ లావాదేవీలను గుర్తించారు. ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: APP MLA Death లుథియానాలో ఆప్‌ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి, తలపై తుపాకీ కాల్పులతో కన్నుమూత